తెలంగాణ

telangana

ETV Bharat / business

అర్జెంట్​గా డబ్బులు కావాలా? షేర్స్ తాకట్టుపెట్టి లోన్ తీసుకోవచ్చు - ఎలాగో తెలుసా? - LOAN AGAINST SHARES

మీ పోర్ట్​ఫోలియోలో షేర్స్ ఉంటే చాలు - తక్కువ వడ్డీతో, సులువుగా లోన్​!

Loan against shares
Loan against shares (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 7:03 PM IST

Loan Against Shares : మీకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయ్యాయా? ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం లేదా? డోంట్ వర్రీ. మీ డీమ్యాట్ అకౌంట్​లో షేర్లు ఉంటే చాలు. వాటిని కొదువ పెట్టి సులువుగా లోన్ తీసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

LAS :ఉదాహరణకు మీ దగ్గర చాలా మంచి కంపెనీలకు చెందిన షేర్లు ఉన్నాయి. కానీ వాటిని అమ్మడం మీకు ఇష్టం లేదు అనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో మీరు ఆ షేర్లను తాకట్టు పెట్టి లోన్ (LAS​) తీసుకోవచ్చు. దీని ద్వారా మీ వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం చాలా సులువుగా రుణం పొందవచ్చు. పైగా ఆ షేర్లు కూడా మీ దగ్గరే ఉంటాయి.

ఎల్​ఏఎస్​ ఎలా పనిచేస్తుంది?
మీ పోర్ట్​ఫోలియోలోని షేర్లను ఎల్​ఏఎస్​ కింద తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, నాన్​-బ్యాంకింగ్ ఫైనాన్సియల్​ కంపెనీలు (ఎన్​బీఎఫ్​సీ)లు ఈ సేవలను అందిస్తాయి. సాధారణంగా మీరు తాకట్టు పెట్టిన షేర్ల విలువలో 50 శాతం పరిమితి వరకు రుణాలుగా ఇస్తాయి. ఇక్కడ రుణగ్రహీతలకు కలిసి వచ్చే అంశం ఏమిటంటే, తాకట్టు పెట్టిన షేర్లు వారి వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలోనే ఉంటాయి. పైగా వాటిపై వచ్చే డివిడెండ్​లు, బోనస్ షేర్లు కూడా వారి ఖాతాలోనే జమ అవుతాయి. ఓటింగ్ హక్కులు కూడా రుణగ్రహీతకే ఉంటాయి. అయితే రుణం తిరిగి చెల్లించేవరకు సదరు షేర్లను అమ్మడానికి వీలుపడదు. ఎల్​ఏఎస్​ కింద తీసుకున్న రుణాన్ని ఏకమొత్తంగా గానీ, ఓవర్​డ్రాఫ్ట్​ కింద గానీ తీసుకోవచ్చు.

లోన్​ ఎలిజిబిలిటీ
బ్యాంకులు కొన్ని నిర్దేశిత కంపెనీల షేర్లపై మాత్రమే రుణాలు అందిస్తాయి. కొన్ని బ్యాంకులు అయితే మ్యుచువల్​ ఫండ్స్​పై, బాండ్లపై కూడా లోన్​ ఇస్తాయి.

అవసరమైన పత్రాలు
షేర్లను తాకట్టు పెట్టుకుని లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు లేదా ఎన్​బీఎఫ్​సీలు కొన్ని కీలకమైన పత్రాలను అడుగుతాయి. అవి:

1. కేవైసీ డాక్యుమెంట్ (పాన్​, ఆధార్​)

2. డీమ్యాట్ అకౌంట్ స్టేట్​మెంట్ (దీని ద్వారా సదరు షేర్లు, మ్యూచవల్ ఫండ్స్​, బాండ్స్​ మీ ఖాతాలో ఉన్నట్లు తెలుస్తుంది.)

3. ఇన్​కమ్ సర్టిఫికెట్ (బ్యాంక్​ స్టేట్​మెంట్స్​, సాలరీ స్లిప్​, ఐటీ రిటర్న్స్​)​

లోన్ నియమ, నిబంధనలు
పర్సనల్ లోన్స్​ కంటే, షేర్లు కొదువపెట్టి తీసుకున్న రుణాలపై (ఎల్​ఏఎస్​) విధించే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ రుణాలను ఒక ఏడాది నుంచి మూడేళ్ల కాలవ్యవధి కోసం తీసుకోవచ్చు. అంతేకాదు రుణాన్ని ఎలా తిరిగి చెల్లించాలనేది కూడా రుణగ్రహీతే నిర్ణయించుకోవచ్చు. అంటే నెలవారీగా వడ్డీ చెల్లించవచ్చు. లేదా ఒకేసారి మొత్తం లోన్ తీర్చేయవచ్చు.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి!

  • స్టాక్ మార్కెట్లో ఒడుదొడుకులు సహజం. కనుక మీరు తాకట్టు పెట్టిన షేర్ల విలువలు పడిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బ్యాంకులు లేదా ఎన్​బీఎఫ్​సీలు - మరిన్ని షేర్లను అదనంగా తాకట్టు పెట్టమని అడగవచ్చు. లేదా మీరు తీసుకున్న రుణంలో కొత్త మొత్తాన్ని తిరిగి చెల్లించమని చెప్పవచ్చు. దీనిని మార్జిన్ కాల్ అని అంటారు.
  • మీ పోర్ట్​ఫోలియోలో ఉన్న షేర్ల ప్రస్తుత మార్కెట్​ విలువను ఆధారంగా తీసుకుని, దానిపై నిర్దేశిత పరిమితి వరకు మాత్రమే రుణాన్ని మంజూరు చేస్తారు. సాధారణంగా మీ షేర్ల మార్కెట్ విలువలో 50 శాతం వరకు మాత్రమే రుణంగా ఇస్తారు.

నోట్​ :ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

అర్జెంట్​గా లోన్ కావాలా? మీ LIC పాలసీపై తక్కువ వడ్డీకే రుణం పొందండిలా!

క్రెడిట్ స్కోర్​ లేకున్నా ఇన్​స్టాంట్​ లోన్​ - ఎలా వస్తుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details