Loan Against Credit Card : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. ఈ రోజుల్లో చెల్లింపులు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. వీటిపై అనేక సంస్థలు రుణం కూడా అందిస్తున్నాయి. ప్రతి కార్డుపై బిల్లు చెల్లించడానికి కొంత సమయం ఉంటుంది. ఈ లోపు బిల్లు చెల్లించలేకపోతే ఈ మొత్తాన్ని రుణంగా మార్చమని మీ క్రెడిట్ కార్డు సంస్థను కోరవచ్చు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య అత్యవసర పరిస్థితి
కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో వెంటనే చేర్చాల్సి వస్తుంది. కొంత మందికి ఆరోగ్య బీమా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా అది సరిపోకపోవచ్చు. ఇలాంటి సరిస్థితుల్లో క్రెడిట్ కార్డుపై ఆధారపడక తప్పదు.
ప్రయాణాలు
ఒక్కోసారి అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మనకు కావలసినవారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం లేదా మరణించడం వంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే అక్కడికి వెళ్లేందుకు విమాన ప్రయాణాలు లాంటివి తప్పనిసరి అవుతాయి. కుటుంబమంతటికి బస్సు, రైలు ప్రయాణం అంటే ఫర్వాలేదు గానీ, విమాన ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇటువంటి సందర్భాల్లో ప్రయాణానికి చేతిలో నగదు లేకపోయితే, క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి.
వాహన రిపేర్లు
కొన్ని సార్లు వాహనాలు సడెన్గా బ్రేక్‌డౌన్ అయ్యి, పెద్ద మరమ్మత్తులకు గురికావచ్చు. వెంటనే రిపేర్ చేయించకపోతే దానికి మరింత పెద్ద మరమ్మతులు జరగవచ్చు, ఆపై ఖర్చులు కూడా పెరగొచ్చు. ఇలాంటి పరిస్థితిలో చేతిలో తగినంత నగదు లేకపోయితే, అప్పుడు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఆ ఖర్చులను భర్తీ చేయొచ్చు.
ఇంటి పునరుద్ధరణ
ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాల కారణంగా, అనుకోని ఘటనల వల్ల ఇంటికి పెద్దపెద్ద మరమ్మతులు చేయాల్సి రావచ్చు. వాటిని వెంటనే చేయించకపోతే ఇల్లు మరింత పాడవుతుంది. ఇంకా, ఇంటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తక్కువ వడ్డీ రేట్లకు లభించే టాపప్ ఇంటి లోన్స్ కోసం ప్రయత్నించవచ్చు. అది సాధ్యంకాని పరిస్థితిలో క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి మరమ్మతు ఖర్చులను భర్తీ చేయొచ్చు.