తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరు నెలల్లో 42 లక్షల పెళ్లిళ్లు - రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి!

Indian Wedding Season Business 2024 : నేడు భారతదేశంలో వివాహం అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ధనికులు, సామాన్యులు అనే బేధం లేకుండా, ప్రతి ఒక్కరూ వివాహం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అందుకే ఈ జనవరి-జులై మధ్యలోని పెళ్లిళ్ల సీజన్​లో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని ఓ అంచనా.

CAIT Survey 2024 on wedding business
Indian wedding season business 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 4:18 PM IST

Indian Wedding Season Business 2024 : భారతీయులకు వివాహం అత్యంత పవిత్రమైనది. అందుకే సంప్రదాయబద్ధంగా బంధు, మిత్రులను పిలుచుకుని, సింపుల్​గా వివాహం చేసుకునేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల నేడు వివాహ వేడుకలు భారీ ఆడంబరాలతో చేసుకుంటున్నారు. ఫలితంగా పెళ్లిళ్లు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి.

కాన్ఫిడరేషన్​ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్​ (CAIT) దేశవ్యాప్తంగా, వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, మన దేశంలో జనవరి 15 - జులై 15 మధ్య సుమారుగా 42 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇందులో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని తేలింది. కనుక 'ఈ పెళ్లిళ్ల సీజన్​ను మన భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించవచ్చు. ఇది మన దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది' అని సీఏఐటీ పేర్కొంది.

మోదీ - డెస్టినేషన్ వెడ్డింగ్​
భారతీయ యువతీయువకులు మన దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దీనితో అన్ని రకాల పెళ్లిళ్లకు మన దేశంలో మరింత ఆదరణ పెరిగిందని సీఏఐటీ పేర్కొంది.

కేవలం దిల్లీలోనే 4 లక్షల పెళ్లిళ్లు
ఈ పెళ్లిళ్ల సీజన్​లో ఒక్క దిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్​ తెలిపారు. 'గత ఏడాది ఇదే పెళ్లిళ్ల సీజన్​లో దిల్లీలో 35 లక్షల వివాహాలు జరిగాయి. వీటి ద్వారా ఏకంగా రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని' వారు స్పష్టం చేశారు.

పెళ్లిళ్లు - ఖర్చులు
ఒక అంచనా ప్రకారం, భారతదేశంలో ఒక్కో పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందంటే?

  • దాదాపు 5 లక్షల పెళ్లిళ్లకు - ఒక్కో దానికి రూ.3 లక్షలు;
  • దాదాపు 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కోదానికి రూ.6 లక్షలు;
  • ఇంకో 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కోదానికి రూ.10 లక్షలు;
  • మరో 10 లక్షల పెళ్లిళ్లకు ఒక్కోదానికి రూ.15 లక్షలు;
  • ఓ 6 లక్షల పెళ్లిళ్లకు ఒక్కోదానికి రూ.25 లక్షలు;
  • మరో 60 వేల పెళ్లిళ్లకు ఒక్కోదానికి రూ.50 లక్షలు;
  • ఇంకో 40 వేల పెళ్లిళ్లకు ఒక్కోదానికి రూ.1 కోటికి పైగా ఖర్చు అవుతుందని అంచనా.

మొత్తంగా చూసుకుంటే ఈ జనవరి 15 నుంచి జులై 15 మధ్య ఉన్న పెళ్లిళ్ల సీజన్​లో, భారత్​లో ఏకంగా రూ.5.5 లక్షల కోట్ల మేరకు బిజినెస్ జరగవచ్చని ఒక అంచనా వేసింది సీఏఐటీ.

డిమాండ్-సప్లై
'దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఈ పెళ్లిళ్ల సీజన్​ను క్యాష్ చేసుకునేందుకు భారీ ఎత్తున వివాహ సంబంధిత వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. కస్టమర్ల డిమాండ్​కు ఏమాత్రం సప్లై తగ్గకుండా చూసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతి వివాహం కోసం కేటాయించిన బడ్జెట్లో వధూవరులకు కలిపి 20 శాతం ఖర్చు అవుతుంది. మిగతా 80 శాతం డబ్బును పెళ్లి ఏర్పాట్లు చేసే థర్డ్-పార్టీ వారికి చెల్లించడం జరుగుతుంది' అని సీఏఐటీ పేర్కొంది.

పెళ్లి ఖర్చులు
మన భారతదేశంలో చాలా మంది ఇళ్లు కట్టిన తరువాతనే వివాహం చేసుకుంటూ ఉంటారు. కనుక ఇంటి నిర్మాణానికి, మరమ్మతులకు, పెయింటింగ్​కు బాగా ఖర్చు చేస్తారు. కనుక ఆయా రంగాల్లో మంచి బిజినెస్ జరుగుతుంది.

పెళ్లిళ్ల విషయానికి వస్తే, భారతీయులు వివాహం కోసం బంగారం, నగలు, వజ్రాల హారాలు, చీరలు, దుస్తులు, లెహంగా-చోళీ, ఫర్నీచర్​, పెళ్లికార్డులు, డ్రైఫ్రూట్స్​, స్వీట్స్​, పళ్లు, పూజా వస్తువులు, కిరాణా సామగ్రి, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ సామగ్రి, విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్​, వివిధ రకాల బహుమతులు, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు ఇలా చెప్పుకుంటూపోతే, లెక్కలేని వస్తువులు కొంటూ ఉంటారు. కనుక భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుంది.

వివాహ వేదికలు
మన దేశంలో వివాహ వేడుకల కోసం పెద్దపెద్ద పెళ్లి మండపాలు, హోటళ్లు, బాంక్వెట్​ (విందు) హాళ్లు , ఓపెన్ లాన్​లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్​హౌస్​లు ఇలా అనేక రకాల వివాహ వేదికలు బుక్ చేస్తారు. వీటితోపాటు టెంట్ డెకరేటర్లు, ఫ్లవర్​ డెకరేషన్లు, మందుగుండు సామగ్రి (క్రాకర్స్​) తీసుకుంటారు. కనుక ఇక్కడా భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.

వెడ్డింగ్ సర్వీసెస్​
పెళ్లి కోసం ఈవెంట్ మేనేజ్​మెంట్​, ప్యాకేజింగ్​, క్యాటరింగ్, ట్రావెల్ సర్వీసెస్​, క్యాబ్ సర్వీసెస్ బుక్​ చేసుకుంటాం. ప్రొఫెషనల్ వెల్​కమ్​ గ్రూప్​లు, ఫొటోగ్రాఫర్​లు, వీడియోగ్రాఫర్​లు, బ్యాండ్లు, మ్యూజీషియన్స్​ లాంటి వారిని కూడా బుక్ చేసుకుంటాం. అలాగే డీజే, పెళ్లి ఊరేగింపు కోసం గుర్రాలు, క్యారేజీలు, లైటింగ్​ ఇలా చాలా సర్వీసులను హైర్ చేసుకుంటాం. కనుక ఈ సర్వీస్ సెక్టార్లకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా సేవల రంగంలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇదంతా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

పెళ్లైన జంటలకు అలర్ట్! మీ వద్ద ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదంటే త్వరపడండి!

గోల్డ్ బాండ్ సబ్​స్క్రిప్షన్​ షురూ - వారికి స్పెషల్​ డిస్కౌంట్ - అప్లై చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details