India To Be Third Largest Economy By 2027 : భారతదేశం ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వృద్ధి వేగానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు.
"భారతదేశం, గత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసింది. దానిని కొనసాగించేందుకు తీసుకొనే చర్యలు ఈ ఏడాది మా అంచనాలను ప్రభావితం చేస్తాయి. దీంతోపాటు ఇండియాలో ప్రైవేటు వ్యయాలు కూడా బాగా పుంజుకొన్నట్లు మేము గమనించాం" అని గీతా గోపీనాథ్ వెల్లడించారు.
"గతేడాది ప్రైవేటు వ్యయాల వృద్ధి 4 శాతం మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు మరింతగా పెరిగే కొద్దీ ఇది కూడా వృద్ధి చెందుతుంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు బాగా పుంజుకున్నాయి. దీనికి వర్షాలు కూడా తోడవటంతో, మంచి పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా వ్యవసాయ ఆదాయం పెరిగి, గ్రామీణ వినిమయం పుంజుకుంటుంది. మా అంచనాలకు ఇవే మూలాలు" అని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ వెల్లడించారు.