Importance Of Network Hospitals In Health Insurance : నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉండడం చాలా అవసరం. మారుతున్న జీవనశైలి కారణంగా ఊహించని వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. కొన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే వైద్య ఖర్చులను కవర్ చేయడానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న బీమా పాలసీని తీసుకోవాలి. దీని వల్ల సమయానికి చేతిలో డబ్బు లేకపోయినా, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో నాణ్యమైన నగదు రహిత చికిత్సలు పొందడానికి వీలవుతుంది.
నగదు రహిత చికిత్స :
నెట్‌వర్క్ హాస్పిటల్స్ పాలసీదారులకు నగదు రహిత చికిత్సలను అందిస్తాయి. ఎందుకంటే, ఈ ఆస్పత్రులు బీమా కంపెనీలతో టై-అప్ అయి ఉంటాయి. అందువల్ల పాలసీదారులు బీమా క్లెయిమ్స్ చేసుకోవడం చాలా సులభం. ఎలా అంటే, పాలసీదారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే, పాలసీ నిబంధనలకు, షరతులకు లోబడి పేషెంట్ బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రికి చెల్లిస్తుంది. కనుక డబ్బు గురించి పాలసీదారులు భయపడాల్సిన అవసరం ఉండదు.
నాణ్యమైన వైద్య చికిత్స కోసం :
ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు నెట్‌వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాస్తవానికి మీకు ఇచ్చిన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో, బీమా సంస్థ వెబ్సైట్లో నెట్‌వర్క్ ఆసుపత్రుల లిస్ట్ ఉంటుంది. వీటి గురించి తెలుసుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో నాణ్యమైన వైద్య చికిత్సను పొందే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ రోగాల చికిత్స కోసం హాస్పిటల్లో చేరాల్సివస్తే, బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే నెట్‌వర్క్ ఆసుపత్రిని ఎంపిక చేసుకునే వీలుంటుంది.
‘టీపీఏ’ ఫారం తప్పనిసరి :
నగదు రహిత చికిత్సను పొందేందుకు హాస్పిటల్లో చేరిన రోగి ‘టీపీఏ’ (థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్)కు ఒక ఫారం ఇవ్వాలి. ఆసుపత్రి కనుక మీ క్లెయిమ్‌ను ధ్రువీకరిస్తే, మీరు నగదు రహిత చికిత్స పొందడానికి అర్హులు అవుతారు. అప్పుడు నిబంధనలకు లోబడి రోగి చికిత్స ఖర్చులన్నింటీనీ బీమా సంస్థనే చెల్లిస్తుంది. కనుక డిశ్చార్జ్ సమయంలో పాలసీదారులు ఎలాంటి బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే పాలసీ పత్రంలో కవర్ చేయని చికిత్సలు ఏమైనా చేసుకుంటే, వాటికైన అదనపు ఖర్చులను బీమా సంస్థ చెల్లించదు.