తెలంగాణ

telangana

ETV Bharat / business

జీవిత బీమా తీసుకుంటున్నారా? ఈ 'రైడర్ల'ను కచ్చితంగా యాడ్ చేసుకోండి! - Life Insurance Riders - LIFE INSURANCE RIDERS

Importance Of Add-on Riders In Life Insurance : మీరు కొత్తగా జీవిత బీమా తీసుకుంటున్నారా? అయితే దీనితోపాటు కొన్ని రైడర్లను కూడా కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే కష్టకాలంలో మీకు పూర్తి ఆర్థిక రక్షణ లభిస్తుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ప్రతి ఒక్కరూ తమ లైఫ్ ఇన్సూరెన్స్​కు జత చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన రైడర్ల గురించి తెలుసుకుందాం.

Life insurance riders in India
Life Insurance Riders

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 11:47 AM IST

Importance Of Add-on Riders In Life Insurance :లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అందుకే సంపాదించే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళికలో కచ్చితంగా జీవిత బీమాకు తగిన స్థానాన్ని కల్పించాలి. నేడు ప్రజల జీవన శైలి చాలా వేగంగా మారుతోంది. దీనికి తగ్గట్టుగానే జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలి. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలను ఎంచుకోవడం మంచిది. అయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్​తో పాటు, కచ్చితంగా కొన్ని అనుబంధ పాలసీలు (రైడర్లు) తీసుకోవడం అవసరం. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రాథమిక జీవిత బీమా పాలసీ విలువను పెంచుకునేందుకు అనుబంధ పాలసీలు (రైడర్లు) ఉపయోగపడతాయి. కనుక పాలసీదారులు తమ నిర్దిష్ట అవసరాలను తీర్చే రైడర్లను ఎంచుకోవాలి. చాలా మంది ప్రాథమిక పాలసీకి అన్ని రకాల రైడర్లను యాడ్​ చేస్తుంటారు. వాస్తవానికి అలాంటి అవసరమేమీ లేదు. అవసరం లేని రైడర్లను జత చేసుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. కనుక, లైఫ్ ఇన్సూరెన్స్​ పాలసీలను ఎంచుకునేటప్పుడు కచ్చితంగా అవసరమైన రైడర్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

అవసరానికి అనుగుణంగా!
సాధారణంగాచిన్న వయస్సులో బాధ్యతలు ఎక్కువగా ఉండవు. కనుక ఆదాయం తక్కువగా ఉన్నా బీమా ప్రీమియం చెల్లించగలుగుతారు. కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక అవసరాలు కూడా అధికం అవుతాయి. కనుక దీనికి తగ్గట్టుగా వివిధ దశల్లో బీమా విలువ పెరిగేలా, మంచి రైడర్లను జోడించుకోవాలి. అయితే వయస్సు పెరిగినప్పుడు బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడతుంది. ఇలాంటి వాటితో అవసరం లేకుండా సులభంగా పాలసీ విలువ పెంచుకునేందుకు ఈ రైడర్స్ తోడ్పడతాయి. అయితే ఈ అనుబంధ పాలసీలను ఒక్కో బీమా సంస్థ ఒక్కో పేరుతో అందిస్తుంటుంది.

1. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తే!
క్యాన్సర్‌, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు లాంటి అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, వెంటనే పరిహారం చెల్లించేలా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో తీవ్ర వ్యాధుల చరిత్ర ఉన్నవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రస్తుతానికి దాదాపు అన్ని బీమా సంస్థలు ఈ తరహా రైడర్‌ను అందిస్తున్నాయి. అయితే రైడర్లను కొనుగోలు చేసేముందు, అవి ఏయే వ్యాధులకు పరిహారం ఇస్తాయో కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే బీమా సంస్థలను బట్టి, కవరేజీలు మారుతుంటాయి. తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు సంబంధిత వైద్య ఖర్చులను తట్టుకునేందుకు క్రిటికల్ ఇల్​నెస్​ రైడర్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2. శాశ్వత వైకల్యం ఏర్పడితే!
దురదృష్టవశాత్తు తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడి శాశ్వత లేదా పాక్షిక వైకల్యం ఏర్పడవచ్చు. అలాంటప్పుడు వైద్య ఖర్చులు, రోజువారీ అవసరాలకు చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకే జీవిత బీమా తీసుకునేటప్పుడు, కచ్చితంగా యాక్సిడెంటల్‌ డిజేబిలిటీ రైడర్‌ను కూడా తీసుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ప్రీమియాలు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. పైగా పాలసీదారులకు నిర్ణీత పరిహారం కూడా లభిస్తుంది. అయితే ఈ యాక్సిడెంటల్​ డిజైబిలిటీ రైడర్ తీసుకునేటప్పుడు కచ్చితంగా నిబంధనలు అన్నీ జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకోవాలి.

3. ప్రీమియం వెనక్కి వచ్చేలా!
సాధారణంగా టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. అందుకే ఈ సంప్రదాయ టర్మ్‌ పాలసీలకు భిన్నంగా చెల్లించిన ప్రీమియంలో కొన్ని మినహాయింపులు పోను మిగతాది వెనక్కి ఇచ్చే, 'రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం' రైడర్​ను తీసుకోవాలి.

4. ఆదాయం ఆగిపోకుండా!
సంపాదించే వ్యక్తి దూరమైతే కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది. అందుకే కుటుంబానికి నెలనెలా వచ్చే ఆదాయం ఆగిపోకుండా 'ఫ్యామిలీ ఇన్‌కం బెనిఫిట్‌ రైడర్‌'ను ఎంచుకోవాలి. దీని వల్ల మీ కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా నిర్ణీత కాలంపాటు స్థిరమైన ఆదాయాన్ని ఈ రైడర్‌ అందిస్తుంది.

షరతులు వర్తిస్తాయి!
బీమా సంస్థలు జీవిత బీమా పాలసీ పరిహారాన్ని ఎలా చెల్లించాలి? అనే దానికి కూడా రకరకాల ఎంపికలను అందిస్తున్నాయి. దీనితోపాటు రైడర్లు తోడైనప్పుడు పాలసీదారుడి కుటుంబానికి అదనపు హామీ మొత్తం లభిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలను బట్టి ఈ అనుబంధ పాలసీలు (రైడర్లు) మారుతూ ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి సరైన రైడర్​ను తీసుకోవాలి. రైడర్లను తీసుకునేప్పుడు వాటికి సంబంధించిన నియమ, నిబంధనలు, షరతులు అన్నీ నిశితంగా పరిశీలించాలి.

5. పాలసీదారుడు మరణిస్తే!
చాలా బీమా సంస్థలు 'యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌ రైడర్‌'ను అందిస్తున్నాయి. దీని వల్ల ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి అదనపు పరిహారం లభిస్తుంది. పైగా ఈ రైడర్‌ కోసం కట్టాల్సిన ప్రీమియం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మన దేశంలో రోడ్డు ప్రమాదాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, తరచూ ప్రయాణాలు చేసేవారు ఈ యాక్సిడెంటల్​ డెత్ బెనిఫిట్​ రైడర్​ను ఎంచుకోవడం మంచిది.

6. ప్రీమియం చెల్లించకున్నా!
సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే బీమా పాలసీ రద్దవుతుంది. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా బీమా పాలసీ కొనసాగాలంటే, 'వైవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌'ను ఎంచుకోవాలి. శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు లేదా కొన్నాళ్లపాటు ఆదాయాన్ని కోల్పోయిన పరిస్థితుల్లోనూ ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు భవిష్యత్‌లో చెల్లించాల్సిన ప్రీమియాలన్నీ చెల్లించే విధంగానూ ఈ రైడర్​ను తీసుకోవచ్చు.

ఈజీగా మీ క్రెడిట్​ స్కోర్​ను పెంచుకోవాలా? అయితే ఈ సింపుల్ టిప్స్​ను​ ఫాలో అవ్వండి! - credit score increase tips

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్​-10 సేఫ్టీ ఫీచర్స్​ మస్ట్​! - Top 10 Car Safety Features

ABOUT THE AUTHOR

...view details