Hyundai Motor India IPO Key Points :దేశంలో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌కు అనుబంధ కంపెనీ అయిన 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్' ఐపీఓ మంగళవారం (అక్టోబర్ 15) నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1865-1960గా ఉండనుంది. ఇప్పటి వరకు ఎల్‌ఐసీనే (రూ.21వేల కోట్లు) అతిపెద్ద ఐపీఓగా ఉంది. కానీ ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ దాన్ని అధిగమించనుంది. గరిష్ఠ ధరల శ్రేణి వద్ద రూ.27,870 కోట్లు సమీకరించేందుకు హ్యుందాయ్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్ ఐపీఓకి సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐపీఓ కీలక తేదీలు :
హ్యూందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 15-17 వరకు ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 14 నుంచే ఐపీఓ ప్రారంభ కానుంది. అక్టోబర్ 18న షేర్ల కేటాయింపు, అక్టోబర్ 21న కంపెనీ రీఫండ్స్ ప్రారంభించనుంది. ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అక్టోబర్ 22న లిస్ట్ అవుతాయి.
ఐపీఓ వివరాలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఐపీఓ ద్వారా సుమారు 3.3 బిలియన్ డాలర్లు (రూ.27,870.16 కోట్లు)కు పైగా నిధులను సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఐపీఓలో హ్యుందాయ్ తన దక్షిణ కొరియా మాతృసంస్థకు చెందిన 142,194,700 (14.22 కోట్ల)షేర్లను లేదా మొత్తం యాజమాన్యంలోని 17.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో రిటైల్, ఇతర పెట్టుబడిదారులకు విక్రయిస్తోంది.