How To Use Car Indicators : కారులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా.. దాని తీవ్రత చాలా ఉండే అవకాశం ఉంటుంది. ఏకంగా ప్రాణాలే గాల్లో కలిసిపోవచ్చు. అందుకే.. ప్రతి ఒక్కరూ పద్ధతిగా వాహనం నడపాల్సి ఉంటుంది. అయితే.. చాలా మంది డ్రైవింగ్ చేయడం అలవాటైన పనేకదా అని కాస్త నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తుంటారు. ఇలాంటప్పుడే ఘోరాలు జరిగిపోతుంటాయి.
అందకే.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. కేవలం ఈ రూల్స్ పాటించకపోవడం వల్లే మెజారిటీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇందులో అందరూ చేసే సాధారణ తప్పు ఇండికేటర్స్ యూజ్ చేయడం. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా మలుపు వద్ద వాహనం టర్న్ తీసుకోవాలని అనుకున్నప్పుడు.. ఎటువైపు వెళ్తున్నామనే విషయాన్ని ఇండికేటర్ ద్వారా తెలియజేస్తాం. కానీ.. చాలా మంది వాహనం నడపడంలో చూపిన ఉత్సాహం.. ఈ రూల్స్ పాటించడంలో చూపించరు. రోడ్డు ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని నిపుణలు చెబుతున్నారు. అందుకే.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఇండికేటర్లు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండికేటర్‌లను ఎలా వేయాలి ?
- కారు డ్యాష్‌బోర్డ్‌పై స్టీరింగ్ వీల్‌కు ఇరువైపులా ఇండికేటర్లు ఉంటాయి. ఎడమవైపు ఇండికేటర్ ఎడమవైపుకు మలుపు తీసుకునేందుకు, కుడివైపు ఇండికేటర్ కుడివైపుకు మలుపు తీసుకునేందుకు ఉపయోగించాలి.
- అయితే.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది మలుపు దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఇండికేటర్ వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. వెనకున్న వారు ఎక్కువ వేగంలో ఉంటే.. వారు వచ్చి ఢీకొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- కాబట్టి.. మలుపు కాస్త దూరంగా ఉండగానే.. ఇండికేటర్‌ను వేయాలి. దీనివల్ల వెనక వచ్చేవారు గుర్తించడానికి కావాల్సిన టైమ్ ఉంటుంది.
- ఇక.. ఓవర్‌టేక్ చేసి టర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు.. ఇండికేటర్ వేయడం చాలా అవసరం. కానీ.. నూటికి 90 మంది ఈ పనిచేయరు.
- మనం ఓవర్‌టేక్ చేసి, ఏ వైపు వెళ్లాలని అనుకుంటున్నామో.. ఆ వైపు ఇండికేటర్ వేయడం ద్వారా సిగ్నల్ ఇవ్వాలి. దీనివల్ల వెనుక నుంచి వస్తున్నవారికి మన ఉద్దేశం తెలుస్తుంది.
- మరో ముఖ్యమైన విషయం.. ఇండికేటర్లు అనగానే చాలా మంది లెఫ్ట్, రైట్‌వైపు ఉన్నవే అనుకుంటారు. కానీ ముందున్న డ్రైవర్ ఉద్దేశం తెలుసుకొనేందుకు కూడా ఇతర ఇండికేటర్లు ఉన్నాయి.
- అన్ని కార్లలో శాశ్వతంగా ఇన్‌స్టాల్ చేసిన 'స్టాప్ ఇండికేటర్' ఉంటుంది. ఇది కారు బ్రేక్‌తో లింక్ చేసి ఉంటుంది.
- కారు బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్‌గా స్టాప్ ఇండికేటర్ వెలుగుతుంది. దీంతో కారు స్పీడ్‌ను తగ్గిస్తున్నామని, కారును పూర్తిగా ఆపేస్తున్నామని వెనుక వస్తున్న డ్రైవర్లకు తెలుస్తుంది.
- కొన్ని అనుకోని సందర్భాల్లో కార్లు బ్రేక్‌డౌన్ అవడం లేదా రోడ్డు మధ్యలో టైర్ పంక్చర్ అవడం జరుగుతుంటాయి.
- ఇలాంటప్పుడు వెనకున్న వాహనాలు ఆగకుండా వెళ్లిపోయేందుకు ఓ ఇండికేటర్ ఉంటుంది. దాన్ని తప్పకుండా వాడాలి.
- ఇలా.. కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా సరైన ఇండికేటర్స్ ఉపయోగించాలి. తద్వారా అవతలి వారికి మన ఉద్దేశం అర్థమవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.