తెలంగాణ

telangana

ETV Bharat / business

సడెన్‌గా జాబ్‌ పోయినా డోంట్ వర్రీ - ఈ స్ట్రాటజీ పాటిస్తే - మీ ఆర్థిక కష్టాలు గట్టెక్కడం గ్యారెంటీ! - HOW TO SURVIVE SUDDEN JOB LOSS

అనుకోకుండా ఉద్యోగం పోయిందా? ఈ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటే చాలు - ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం గ్యారెంటీ!

Job Loss
Job Loss (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2024, 5:30 PM IST

How To Survive Sudden Job Loss :నేటి కాలంలో ప్రైవేట్ జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా లేఆఫ్‌ల కాలంలో అయితే సాధారణ ఉద్యోగుల పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇలా అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు మనం ఏం చేయాలి? మన ఆర్థిక పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలి? ఉన్న కాస్త డబ్బును ఎలా సరిగ్గా వినియోగించుకోవాలి? అనే విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మనకు చాలా సిల్లీగా అనిపించే విషయాలే, మనల్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కెస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయి, మరే ఇతర సంపాదన లేని సమయంలో ఈ చిట్కాలే మనల్ని ఆదుకుంటాయి. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  1. ఉద్యోగం పోయిన తరువాత చాలా బాధగా ఉండడం సహజమే. కానీ ముందుగా మీరు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు, ఆస్తులు, అలాగే తీర్చాల్సిన అప్పులు, దైనందిన ఖర్చులు, అత్యవసర ఖర్చులు ఇలా అన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది.
  2. మీ దగ్గర ఉన్న డబ్బును కేవలం అవసరమైన వాటికి మాత్రమే వినియోగించాలి. అంటే ఇంటి అద్దె, రోజువారీ ఆహార ఖర్చులు, ఇంటికి కావాల్సిన పచారీ సరకులు (కిరాణా సామగ్రి), మందులు లాంటి వాటికి మాత్రమే డబ్బులు ఖర్చు చేయాలి. అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గించేయాలి. అంటే అవసరంలోని లగ్జరీ వస్తువులు కొనడం, సినిమాలకు, పార్కులకు, పర్యటనలకు వెళ్లడం లాంటి వినోద ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవాలి.
  3. నిరుద్యోగులుగా ఉన్న సమయంలో కచ్చితంగా పక్కా బడ్జెట్ వేసుకోవాలి. దీని వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి. దీని వల్ల మరింత ఆర్థిక కష్టాల్లోకి జారిపోకుండా ఉండగలుగుతాం.
  4. ప్రతి వ్యక్తీ కచ్చితంగా ఓ అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. కనుక కనీసం 6-12 నెలల కాలానికి సరిపోయే విధంగా ఈ ఎమర్జెనీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటుంది. కనుక మీ ఉద్యోగం పోయిన సందర్భాల్లో ఈ అత్యవసర నిధిని తెలివిగా, జాగ్రత్తగా వాడుకోవాలి.
  5. ఉద్యోగం పోయినప్పుడు బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తీరవు. అందువల్ల మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఆ లోపు తాత్కాలికంగా మీ ఆర్థిక సమస్యలను తగ్గించుకునేందుకు ఫ్రీలాన్సింగ్‌ జాబ్స్ లేదా పార్ట్-టైమ్ జాబ్స్‌ చేయాలి. దీని వల్ల మీకు కాస్త ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడానికి ఉత్సాహం వస్తుంది.
  6. ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేసి ఉంటాయి. కనుక వాటిని మీరు కష్టకాలంలో తెలివిగా వాడుకోవాలి. అలాగే అత్యవసరం అయితే పర్సనల్ లోన్స్‌ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రుణాలు వీలైనంత వరకు చాలా తక్కువ వడ్డీ రేటుతో తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, అది మిమ్మల్ని రుణాల ఊబిలోకి తోసేస్తుంది. కనుక తస్మాత్‌ జాగ్రత్త!
  7. జాబ్ పోయిందని పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోకూడదు. ఎప్పుడూ ఆశావాహ దృక్పథం (పాజిటివ్ అవుట్‌లుక్‌)తో ఉండాలి. మీ నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. ఇండస్ట్రీ ఈవెంట్‌లకు వెళ్తూ ఉండాలి. లింక్డ్‌ఇన్‌ లాంటి ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే మీకు మరో మంచి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.
  8. ఉద్యోగం పోయిన తరువాత అలాగే ఖాళీగా ఉండకుండా, ఇండస్ట్రీకి అవసరమైన కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఇందుకోసం ఆన్‌లైన్ కోర్సులు, ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ల్లో చేరాలి. వాటిలో మంచి స్కోర్‌తో సర్టిఫికేషన్స్‌ తీసుకోవాలి. దీని వల్ల జాబ్‌ మార్కెట్‌లో మీరు కాంపిటేటివ్‌గా ఉండగలుగుతారు.
  9. అన్నింటి కంటే ముఖ్యంగా మీరు ఎల్లప్పుడూ ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి. ఆశావాహ దృక్పథంతో ఉండాలి. గుర్తుంచుకోండి - కష్టాలైనా, సుఖాలైనా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ముందుంది మంచి కాలం అని నమ్మాలి. కనుక పైన చెప్పిన టిప్స్‌ అన్నీ ఫాలో అయితే కచ్చితంగా మీకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆల్‌ ది బెస్ట్!

ABOUT THE AUTHOR

...view details