Fuel Saving Tips For Bike Riders : కొత్త బైక్ కొన్నప్పుడు అది మంచి మైలేజ్ ఇస్తుంది. కానీ బైక్ పాతబడుతున్న కొద్దీ దాని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ తగ్గిపోతుంది. దీనితో బైక్ పెట్రోల్ విపరీతంగా తాగేస్తుంది. దీని వల్ల మీ జేబుకు చిల్లుపడుతుంది. అందుకే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు కచ్చితంగా పాటించాలి. అప్పుడే మీ బైక్ మైలేజ్ పడిపోకుండా ఉంటుంది.
పెట్రోల్ సేవ్ చేయడానికి పాటించాల్సిన చిట్కాలు!
- బైక్‌ను ఎప్పుడూ స్టడీ స్పీడ్‌లో నడపాలి. దీని వల్ల కచ్చితంగా పెట్రోల్ ఆదా అవుతుంది. అలా కాకుండా బైక్ స్పీడ్‌ను పెంచుతూ, తగ్గిస్తూ ఉంటే, ఇంజిన్‌పై దాని ప్రభావం పడుతుంది. దీనితో పెట్రోల్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది.
- బండి నడిపేటప్పుడు టైర్ ప్రెజర్ సరిగ్గా ఉందో, లేదో కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే బండి డ్రైవ్ చైన్ టెన్షన్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. సరిపడా టైర్ ప్రెజర్ లేనప్పుడు చాలా వేగంగా, జిగ్‌జాగ్‌గా బైక్ డ్రైవ్ చేస్తే, పెట్రోల్ చాలా త్వరగా అయిపోతుంది.
- కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ గ్యారేజ్ లేదా వర్క్‌షాప్ వద్ద మాత్రమే మీ ఇంజిన్‌ను ట్యూన్ చేయించండి. అలాగే అక్కడే మీ బైక్‌ను క్రమం తప్పకుండా సర్వీస్ చేయించండి. దీని వల్ల మీ బైక్ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ బాగుంటుంది.
- ఎల్లప్పుడూ ఉద్గార స్థాయిలు తక్కువగా (లో ఎమిషన్ లెవెల్స్) ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ పాటించడం వల్ల మీ టూ-వీలర్ మంచి మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఖర్చులు బాగా ఆదా అవుతాయి.
ఈ తప్పులు చేయవద్దు!
- బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు క్లచ్ లివర్ అలానే నొక్కి ఉంచకూడదు.
- లో గేర్ వేసి, ఎక్కువ సేపు బండి(ఇంజిన్)ని నడపకూడదు.
- మీ బండిని వీలైనంత వరకు ఎండలో పార్క్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎండలో బైక్ ఉంచితే, సూర్యరశ్మి ప్రభావం వల్ల పెట్రోల్ చాలా వరకు ఆవిరైపోయే ఛాన్స్ ఉంటుంది.
- బైక్ నడుపుతున్నప్పుడు బ్రేక్ పెడల్పై కాలు వేసి, నొక్కి ఉంచకూడదు. అత్యవసరమైనప్పుడు మాత్రమే బ్రేక్ పెడల్‌ను నొక్కాలి. లేకుంటే పెట్రోల్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది.
- ట్రాఫిక్‌లో ఆగాల్సివచ్చినప్పుడు ఇంజిన్ ఆర్పీఎంను అనవసరంగా పెంచకూడదు. మీరు కనుక 30 సెకెన్ల కంటే, ఎక్కువ సేపు బండిని ఆపాల్సి వస్తే, కచ్చితంగా మీ ఇంజిన్‌ను 'ఆఫ్' చేయడమే మంచిది.
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ ఇన్‌లెట్‌ను కవర్ చేయకూడదు.
- ఇంజిన్లోకి చక్కగా గాలి వెళ్లినప్పుడే, అది హీట్ ఎక్కకుండా ఉంటుంది. అలాకాకుండా ఇంజిన్‌ను మీరు దేనితో అయినా కవర్ చేశారనుకోండి. ఇంజిన్‌కు సరిగ్గా గాలి తగలదు. దీనితో ఇంజిన్ వేడెక్కుతుంది. ఫలితంగా అది ఎక్కువ పెట్రోల్‌ను తాగేస్తుంది.