How To Renew Expired Car Insurance Online : భారతదేశంలో కారు కొనాలని అనుకుంటే ఇన్సూరెన్స్ చేయడం తప్పనిసరి. ప్రమాదం, దొంగతనం, లేదా ఇతర రూపాల్లో వాహనానికి నష్టం జరిగినప్పుడు ఈ బీమా పాలసీ ఆర్థిక రక్షణను కల్పిస్తుంది. నగదు ఖర్చును తగ్గిస్తుంది. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చాలా మంది బీమా కంపెనీలకు వెళ్లాలని అనుకుంటారు. కానీ అలాంటి అవసరం ఏమీ లేదు. ఆన్లైన్లోనే చాలా సులువుగా కారు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఒక వేళ మీ కారు ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతే, దానిని కూడా ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకోవచ్చు.
కారుకు ఇన్సూరెన్స్ చేయించకపోతే ఏమవుతుంది?
వాహన బీమా చేయించకపోతే అనేక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో మొదటిది ఇన్సూరెన్స్ చేయించకుండా డ్రైవింగ్ చేయడం మన దేశంలో చట్టవిరుద్ధం. కనుక మీరు ఇన్సూరెన్స్ లేని బండితో పట్టుబడితే జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్ లేదా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం లాంటి పలు శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తోడు కారుకు ఏదైనా ప్రమాదం లేదా నష్టం జరిగితే, మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. జరిగిన డ్యామేజ్‌ను కవర్ చేయడానికి మీ జేబు నుంచే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే గడువు తీరక ముందే మీ కారు ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవాలి.
ఆన్లైన్లో కారు బీమా రెన్యువల్ చేసే ముందు, మీ కారు పాత ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని బయటకు తీసి దగ్గర పెట్టుకోవాలి. అందులో పాలసీ నంబరు, కవరేజీ వివరాలు, పాత ఇన్సూరర్ సమాచారం ఉంటుంది. అలాగే వాహన రిజిస్ట్రేషన్, కారు మోడల్ నంబర్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితోపాటు మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా తదితర వివరాలు కూడా కావాల్సి ఉంటుంది. గతంలో మీరు నో క్లెయిమ్ బోనస్ పొందినట్లయితే, దానికి NCB ధ్రువపత్రం కూడా ఉండాలి.
ఇన్సూరర్‌ను ఎంపిక చేసుకోవడం
వాహన బీమా కోసం మంచి ఇన్సూరర్ (బీమా కంపెనీ)ని ఎంపిక చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ప్రస్తుతమున్న బీమా సంస్థతోనే కొనసాగవచ్చు. లేదా మీ అవసరాలకు, బడ్జెట్‌కు తగిన పాలసీని ఇచ్చే బీమా కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే బీమా పాలసీ తీసుకునే ముందు, సదరు కంపెనీ కల్పిస్తున్న బీమా కవరేజీ, ప్రీమియం, మార్కెట్లో సదరు సంస్థకున్న రెప్యుటేషన్ గురించి కూడా తెలుసుకోవాలి.