How To Protect Credit Card Data : నేడు ఆన్‌లైన్ షాపింగ్ చేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. మనకు కావాల్సిన వస్తు, సేవలను ఇంట్లోనే ఉండి - మంచి డిస్కౌంట్స్, ఆఫర్స్‌తో కొనడానికి వీలుండడమే ఇందుకు కారణం. అయితే దీని వల్ల చాలా రిస్క్‌లు కూడా ఉన్నాయి. నేడు ఆన్‌లైన్ స్కామ్‌లు, సైబర్ క్రైమ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు చాలా సులువుగా మన డెబిట్, క్రెడిట్ కార్డ్ డేటాను దొంగిలిస్తున్నారు. మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచుకుంటున్నారు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు మన డెబిట్, క్రెడిట్ కార్డ్ డేటాను ఎలా సంరక్షించుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్త :ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు వెబ్‌సైట్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం విశ్వసనీయ వెబ్‌సైట్లను మాత్రమే ఓపెన్ చేయాలి. ఆకర్షణీయమైన ఆఫర్లు అందించే నకిలీ వెబ్‌సైట్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌లో కచ్చితంగా https:// ఉందా, లేదా అనేది చూసుకోవాలి.
2. సెక్యూరిటీ బ్యాడ్జ్ మస్ట్ : వెబ్‌సైట్ అడ్రస్‌లో కచ్చితంగా లాక్ సింబల్ (SSL సర్టిఫికెట్) ఉంటేనే దానిని ఓపెన్ చేయాలి. అలాగే వెబ్‌సైట్ లోగోలను కూడా చూడాలి. అప్పుడే నకిలీ వెబ్‌సైట్ల బారిన పడకుండా ఉంటాం.
3. టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను ఎనేబుల్ చేయాల్సిందే :సైబర్ నేరగాళ్లు కొన్నిసార్లు మన పాస్‌వర్డ్‌లను ఈజీగా కనుక్కొనే ప్రమాదం ఉంది. కనుక అలాంటి వారి బారిన పడకుండా ఉండాలంటే, కచ్చితంగా టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీని వల్ల మీకు సెకెండ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తేనే మీ ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. అంటే దీని వల్ల మీకు అదనపు రక్షణ లభిస్తుంది.
3. వర్చువల్ లేదా డిస్పోసబుల్ క్రెడిట్ కార్డులను వాడాలి : మీ క్రెడిట్ కార్డ్‌కు అనుబంధంగా ఉన్న వర్చువల్ లేదా డిస్పోసబుల్ క్రెడిట్ కార్డులను వాడుతూ ఉండాలి. ఇవి టెంపరరీగా లేదా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ వరకు మాత్రమే పనిచేస్తాయి. కనుక ఫ్రాడ్స్ బారిన పడకుండా మీకు మంచి రక్షణ లభిస్తుంది.
4. మీ అకౌంట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయాలి : చాలా మంది క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ ఆర్థిక లావాదేవీలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఏవైనా ట్రాన్సాక్షన్స్ అనుమాస్పదంగా ఉంటే, వెంటనే మీకు కార్డ్ జారీ చేసిన బ్యాంకుకు రిపోర్ట్ చేయాలి.