How To Check Vehicle Owner Details By Number Plate :ప్రస్తుత కాలంలో హిట్ అండ్ రన్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాన్ని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయి చాలా మంది తప్పించుకుంటున్నారు. అందుకే ఇలాంటి సందర్భాల్లో మీ వాహనాన్ని ఢీకొట్టిన వెహికల్ నంబర్ ప్లేట్‌ను ఫొటో తీయాలి. లేదా దాన్ని గుర్తు పెట్టుకోవాలి. దీని వల్ల ఆ బండి యజమాని వివరాలను చాలా సులువుగా తెలుసుకోవచ్చు. అలాగే సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు కూడా నంబర్ ప్లేట్ ఆధారంగా నిజమైన యజమాని వివరాలను గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
హిట్ అండ్ రన్ :మీ వాహనాన్ని ఢీకొట్టి వేరొక వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడని అనుకుందాం. అప్పుడు హిట్ అండ్ రన్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే మిమ్మల్ని ఢీకొట్టిన వాహనదారుడి కచ్చితమైన వివరాలు అవసరం అవుతాయి. అందుకే ఎవరైనా మీ వాహనాన్ని ఢీకొడితే, వెంటనే వారి నంబర్ ప్లేట్లను ఫొటో తీయాలి. ఆ నంబర్ ప్లేట్ ద్వారా మిమ్మల్ని ఢీకొట్టిన వాహన యజమాని వివరాలను పొందవచ్చు.
సెకెండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు :మనలో చాలా మందికి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ కొత్త వాహనం కొనేంత డబ్బులు మన దగ్గర ఉండకపోవచ్చు. అటువంటి సమయాల్లో మన చేతిలో ఉన్న ఏకైక ఆప్షన్, ఎవరైనా సెకెండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మితే దానిని కొనుగోలు చేయడం. సెకెండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, దాని యజమాని ప్రామాణికమైన వివరాలను తెలుసుకోవాలి. మీరు కొనే వాహనంపై ఏవైనా కేసులు ఉన్నాయా? వాహనంపై ఏవైనా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు కొనుగోలు చేయబోయే వాహనం నంబర్ ప్లేట్ ఉపయోగించి, దాని అసలైన యజమాని వివరాలు కూడా చూడాలి. అప్పుడే మోసానికి గురికాకుండా ఉంటాం.