తెలంగాణ

telangana

ETV Bharat / business

రియల్ ఎస్టేట్ స్కామ్స్​ నుంచి సేఫ్​గా ఉండాలా? ఈ టిప్స్ పాటించాల్సిందే! - Tips To Avoid Real Estate Scams - TIPS TO AVOID REAL ESTATE SCAMS

Tips To Avoid Real Estate Scams : దేశంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. అదే సమయంలో మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు, పెద్దపెద్దవాళ్లు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ రెరా (RERA) నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం.

Tips To Avoid Real Estate Scams
How to avoid real estate scams? (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 5:06 PM IST

Tips To Avoid Real Estate Scams : మీరు కొత్తగా ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? కానీ రియల్ ఎస్టేట్ మోసాల గురించి భయపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. రెరా నిబంధనలు తెలుసుకుంటే, రియల్ ఎస్టేట్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు.

బురిడీ కొట్టిస్తారు!
కొందరు రియల్ ఎస్టేట్వ్యాపారులు ప్రీ లాంచింగ్‌ ఆఫర్ల పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తారు. మరికొందరు ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మించి, డబ్బులు తీసుకుని కూడా, ఏళ్ల తరబడి నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తుంటారు. ఇంకొందరు ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇళ్లు నిర్మించి ఇస్తారు. దీని వల్ల ఎంతో ఆశపడి ఫ్లాట్ కొనుకున్నవాళ్లు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు.

రెరా నిబంధనలు ఏం చెబుతున్నాయి?
రియల్‌ ఎస్టేట్‌ మోసాల నుంచి రక్షణ కవచంలా ఉపయోగపడేదే రెరా చట్టం. అందుకే దీని గురించి వివరంగా తెలుసుకోవాలి.

  • స్థిరాస్తి వ్యాపారంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇంటి నిర్మాణంలో నాణ్యత లోపాలు, పనుల్లో జాప్యం, మోసాలు, అవకతవకలు ఇలా చాలానే సమస్యలు ఉంటాయి. వీటిని నియంత్రించి, కొనుగోలుదారులకు బాసటగా నిలిచేందుకే కేంద్ర ప్రభుత్వం రెరా యాక్ట్​ను తీసుకువచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ అమలు చేస్తున్నాయి.
  • రెరా చట్టం ప్రకారం, 'రియల్ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ' అనుమతి లేకుండా ఏ స్థిరాస్తి ప్రాజెక్ట్​ నిర్మించకూడదు. అమ్మకాలు జరపకూడదు.
  • ఒక వేళ రెరా అనుమతి పొందిన స్థిరాస్తి విషయంలో ఏవైనా వివాదాలు ఏర్పడితే, రెరా న్యాయాధికారి ద్వారా తక్షణ న్యాయం పొందేందుకు అవకాశం ఉంది.

రెరా చట్టం ప్రకారం

  • రెరా గుర్తింపు లేకుండా 8 ప్లాట్లు లేదా 500 చ.మీ. దాటిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు.
  • ముందస్తుగా ఎలాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులు అమ్మకూడదు.
  • రియల్ ఎస్టేట్​ వ్యాపారులు - దరఖాస్తు చేసే సమయంలోనే, వారికి ఈ రంగంలో ఉన్న అనుభవం గురించి తెలపాలి.
  • రియల్ ఎస్టేట్​ వ్యాపారులు - నిర్మాణానికి కావాల్సిన మూలధనం వివరాలను కూడా ముందే వెల్లడించాలి.
  • ప్రాజెక్ట్​లో పనిచేసే ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఎంఈపీ, సీఏ, కాంట్రాక్టరు తదితరుల వివరాలను రెరాకు కచ్చితంగా తెలియజేయాలి.
  • రెరా నుంచి అనుమతి పత్రం తీసుకోకుండా, నిర్మాణానికి సంబంధించిన ప్రకటనలు చేయకూడదు. కరపత్రాలు పంచకూడదు. గోడ పత్రికలను అంటించకూడదు.
  • ప్రీలాంచ్‌ విక్రయాలు కూడా చేపట్టకూడదు.

ఇలా చేయాల్సిందే!

  • బిల్డర్లు కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి.
  • ముందే అనుకున్న విధంగా నిర్మాణ పనులు సక్రమంగా జరుగుతున్నట్లు రుజువులు చూపించాలి.
  • ప్రత్యేక ఖాతాలో జమ చేసిన నగదును ఇతర అవసరాలకు వాడకూడదు.
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి జమా ఖర్చుల వివరాలను రెరా అథారిటీకి కచ్చితంగా సమర్పించాలి.
  • ఆస్తి విలువలో 10 శాతం కంటే ఎక్కువగా కొనుగోలుదారుల నుంచి బయానాగా తీసుకోకూడదు. ఒక వేళ తీసుకోవాలంటే, ఇరువురి మధ్య సిఫార్సు చేసిన నమూనా ప్రకారం ఒప్పందం కుదుర్చుకోవాలి.
  • బయానా తీసుకున్నప్పుడే, ఇంటిని లేదా ఫ్లాట్​ను స్వాధీనపర్చే తేదీని కూడా లిఖితపూర్వకంగా వెల్లడించాలి.
  • ఒప్పందం ప్రకారం, నిర్మాణ పనులు చేయాలి. అన్ని సౌకర్యాలు కల్పించాలి.
  • ఏ పనిని, ఏ (డేట్​) సమయంలోపు పూర్తి చేస్తారనే విషయాన్ని కూడా కచ్చితంగా చెప్పాలి.
  • ఒప్పందంలో లేదా ప్లాన్‌లో పేర్కొన్న నమూనా ప్రకారమే నిర్మాణం చేయాలి.
  • ఒకవేళ నిర్మాణంలో ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే, కొనుగోలుదారుల నుంచి కచ్చితంగా లిఖితపూర్వక సమ్మతి తీసుకోవాలి.
  • నిర్మాణ పురోగతికి సంబంధించిన నివేదికలు, చిత్రాలు ప్రతి 3 నెలలకు ఒకసారి రెరా వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలి.
  • రియల్ ఎస్టేట్​కొనుగోళ్లు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంటాయి. అందువల్ల మధ్యవర్తిని కూడా రెరా చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
  • మధ్యవర్తి సేవా లోపాలకు, నిర్మాణదారుడు కూడా సహ బాధ్యుడు అవుతాడని రెరా చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే!

  • రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒప్పందంలో పేర్కొన్న తేదీ నాటికి, నిర్మాణం పూర్తి చేసి, సదరు ఇంటిని లేదా ఫ్లాట్​ను కొనుగోలుదారులకు అప్పగించాలి.
  • గడువు దాటిన తరువాత కూడా ఇంటిని స్వాధీనపరచకపోతే, రెరా సిఫార్సు చేసిన వడ్డీని, ప్రతినెలా కొనుగోలుదారుకు చెల్లించాల్సి ఉంటుంది.
  • నిర్మాణదారే 5 ఏళ్ల వరకు నాణ్యతా లోపాలకు బాధ్యుడిగా ఉంటాడు.
  • కొనుగోలుదారులు ఏవైనా లోపాలు గుర్తిస్తే, బిల్డరే ఎలాంటి రుసుములు తీసుకోకుండా, పూర్తి ఉచితంగా మరమ్మతు చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
  • నిర్మాణం పూర్తి అయ్యి ఆస్తులను విక్రయించాక, బిల్డర్​ కొనుగోలుదారుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
  • ఆ సంఘానికి సదరు స్థిరాస్తికి సంబంధించిన ఉమ్మడి ఆస్తులను అప్పగించాలి.
  • రెరా నిబంధనల ప్రకారం, కార్పెట్‌ ఏరియా, ఫ్లింత్‌ ఏరియా, కామన్‌ ఏరియాలను విడివిడిగా చూపించాలి. ఇంతకు ముందు వరకు ఈ మూడింటిని కలిపి సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా విక్రయించేవారు.

రిజిస్ట్రేషన్ చూసుకోవాల్సిందే!

  • ఏదైనా లేఅవుట్‌లో స్థలం తీసుకోవాలన్నా, బహుళ అంతస్తుల నిర్మాణంలో ఫ్లాట్‌ కొనుగోలు చేయాలన్నా, ముందుగా దానికి రెరా రిజిస్ట్రేషన్ ఉందో, లేదో తెలుసుకోవాలి.
  • ఆంధ్రప్రదేశ్​/ తెలంగాణా రెరా వెబ్​సైట్లలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్​ : rera.ap.gov.in

తెలంగాణ :rera.telangana.gov.in

రిస్క్​ లేకుండా ఆదాయం సంపాదించాలా? 'సిల్వర్​ ETFs'పై ఓ లుక్కేయండి! - What Is Silver ETF

నెలకు రూ.5వేలు పెట్టుబడితో రూ.42లక్షల ఆదాయం - PPF స్పెషల్ స్కీమ్​! - PPF Special Scheme

ABOUT THE AUTHOR

...view details