How Much Gold Can You Keep At Home : అత్యంత ప్రజాదరణ పొందిన లోహాల్లో బంగారం ఒకటి. దీనిని వ్యక్తిగతంగా వాడుతుంటారు. పెట్టుబడిగానూ వినియోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది చాలు మనోళ్లకు బంగారమంటే ఎంత ఇష్టమో చెప్పటానికి. ముఖ్యంగా మన ఆడపడుచులు పసిడిని ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ లాంటి పండగలు మొదలు పెళ్లి వరకు, సందర్భం ఏదైనా నగల దుకాణానికి వెళ్లాల్సిందే. అయితే మన ఇంట్లో గరిష్ఠంగా ఎంత వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు? పసిడి ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత పన్ను విధిస్తారు? అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Storage Limit In India :సాధారణంగా మన ఇంట్లో ఎంత బంగారం అయినా ఉంచుకోవచ్చు. అయితే ఆ ఆభరణాలు కొనుగోలు చేయడానికి లేదా గోల్డ్ పెట్టుబడులకు ఆదాయం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆదాయ పన్ను శాఖ వారికి చూపించాల్సి ఉంటుంది. లేని పక్షంలో కచ్చితంగా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఇక పన్ను కట్టకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చంటే? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకారం, పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని అమ్మాయిలు 250 గ్రాములు ఉంచుకోవచ్చు. అదే పురుషులు విషయానికి వస్తే, పెళ్లి అయినా, కాకపోయినా ఎలాంటి ఆధారాలు చూపించకుండా 100 గ్రాముల వరకు బంగారాన్ని నిల్వ చేసుకోవచ్చు.
గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎంత పన్ను చెల్లించాలి?
Tax Implications On Gold Investments :''బంగారాన్ని వ్యక్తిగత అవసరాలకు, పెట్టుబడి పెట్టేందుకు - ఇలా రెండు రకాలుగా కొనుగోలు చేస్తారు. ఏది ఏమైనా పసిడి కొనుగోలుపై ప్రత్యక్ష పన్ను ఉండదు. బంగారంపై పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు 3 శాతం వరకు జీఎస్టీ చెల్లించాలి. అదే మేకింగ్, కంసాలి రుసుముల విషయంలో 5 శాతం వరకు జీఎస్టీ చెల్లించాలి. ఇక విదేశాల నుంచి స్వర్ణం దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ సెస్, జీఎస్టీ రూపంలో మరింత చెల్లించాల్సి ఉంటుంది.
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బంగారం సంబంధించిన సమాచారం చూపించాల్సి వస్తుంది. పన్ను చెల్లింపుదారుల ఆదాయం రూ.50 లక్షలకు మించి ఉంటే, వారు ఐటీఆర్‌లో దేశీయ ఆస్తుల్లో (డొమెస్టిక్ అసెట్స్) భాగంగా బంగారం నిల్వల వివరాలు చూపించాలి.