తెలంగాణ

telangana

హౌస్​ లోన్​ EMI భారంగా ఉందా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈజీగా! - Home Loan EMI Reducing Tips

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 11:35 AM IST

How To Reduce Home Loan EMI : సాధారణంగా ఇంటిపై రుణాలు తీసుకునేవారికి దీర్ఘకాలం పాటు ఈఎంఐలు చెల్లించడం కొంతవరకు భారమేనని చెప్పాలి. మరి ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చవంటే?

Home Loan EMI Reducing Tips
Home Loan EMI Reducing Tips (Getty Images)

How To Reduce Home Loan EMI :సొంత ఇల్లు ఉండాలని అంతా కోరుకుంటారు. అయితే సొంత ఇల్లు పెద్ద మొత్తంతో కూడిన ఆస్తి కాబట్టి, చాలా మందికి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. దానికి తిరిగి చెల్లించే ఈఎంఐ కూడా ఎక్కువే ఉంటుంది. రుణ ఈఎంఐలు చెల్లించడానికి 15-25 సంవత్సరాలు కాలపరిమితిని ఎంపిక చేసుకుంటారు. ఇంత సుదీర్ఘ కాలం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పక్కన పెట్టవలసి ఉంటుంది.

అయితే అధిక మొత్తంతో కూడిన ఈఎంఐల వల్ల కొన్నిసార్లు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇంటి రుణ ఈఎంఐ ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయంలో 50% కంటే ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి నెలవారీ బిల్లులు చెల్లించడానికి, ఇతర విషయాలపై ఖర్చు పెట్టడానికి తగినంత డబ్బు మిగిలి ఉండదు. అందుకే, ఒకరి రుణ ఈఎంఐ అతని ఆదాయంలో 50% కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇంటి రుణాలపై ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్‌ స్కోరు మెరుగుపరుచుకోండి!
కొంతమంది గతంలో మెరుగైన క్రెడిట్‌ స్కోరును కలిగి ఉండని సందర్భంలో అధిక వడ్డీ రేటుతో ఇంటి రుణాన్ని తీసుకుని ఉంటారు. కానీ, తర్వాత ఇంటి రుణాన్ని కరెక్ట్​గా చెల్లిస్తే క్రెడిట్‌ స్కోరు గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటి రుణంపై వడ్డీ రేటును తగ్గించమని మీరు బ్యాంకును అభ్యర్థించడం మంచిది. ఎందుకంటే, గతంలో పేలవమైన క్రెడిట్‌ స్కోరు కారణంగా మీకు రుణాన్ని అందించని చాలా అగ్రశ్రేణి రుణసంస్థలు ఇప్పుడు మీ దరఖాస్తును అనుకూలంగా చూడవచ్చు. ఈ కారణంగా వడ్డీ రేటు తగ్గితే ఈఎంఐ కూడా తగ్గుతుంది.

ఈఎంఐ టైమ్ తగ్గించుకుంటే!
రుణగ్రహీతలు ఏవైనా బలమైన కారణాలతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే ఇంటి రుణ ఈఎంఐ మొత్తాన్ని తగ్గించడం ద్వారా కొంత ఆర్థిక ఉపశమనం పొందొచ్చు. దీనివల్ల రుణ కాలవ్యవధి పెరుగుతుంది. అయితే, కాలవ్యవధి పెంపుదల రుణగ్రహీత పదవీ విరమణకు ఇంకా మిగిలి ఉండే కాలంపై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ దూరంగా ఉండి, ఎక్కువ కాలం పాటు ఉపాధి, ఉద్యోగంలో కొనసాగేవారికి ఈఎంఐ కాలవ్యవధి పెంచుకోవడం చాలా వరకు ఉపశమనాన్ని ఇస్తుంది. దీర్ఘకాల చెల్లింపుల వల్ల వడ్డీ భారం పెరిగినప్పటికీ, కొంతకాలానికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పాక్షికంగా ముందస్తు చెల్లింపులు చేయడం ద్వారా ఈఎంఐలను క్రమంగా తగ్గించుకోవచ్చు.

రుణ బదిలీ చేసుకుంటే ఈజీగా!
అనేక బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు గృహ రుణాన్ని అందిస్తున్నప్పటికీ, వారు విధించే వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. మీరు అధిక వడ్డీ రేటుతో ఇంటి రుణాన్ని తీసుకొని ఉంటే దాన్ని రీఫైనాన్స్‌ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో మీ ప్రస్తుత రుణాన్ని తక్కువ వడ్డీ రేటు లేదా సరళమైన నిబంధనలను అందించే మరొక బ్యాంకుకు బదిలీ చేయొచ్చు. అయితే, ఇలా చేయడానికి ముందు పాత రుణ సంస్థకు ఈఎంఐలను సకాలంలో తిరిగి చెల్లించేలా చూసుకోండి. అయితే, రుణాన్ని ఇచ్చే కొత్త బ్యాంకుకు మీరు కొంత వరకు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా తక్కువ వడ్డీ రేటుకు రుణ బదిలీని చేసినట్లయితే మీ ఈఎంఐ తగ్గుతుంది.

ఫిక్స్‌డ్‌ నుంచి ఫ్లోటింగ్‌ రేటుకు!
మీరు ఫిక్స్‌డ్‌ రేటు రుణాన్ని తీసుకున్నట్లయితే, రుణ కాలవ్యవధిలో ఎక్కువ వడ్డీ రేటును చెల్లించే ఉంటారు. బ్యాంకులు ఫిక్స్‌డ్‌ రేటు రుణాలపై 1-2% అధిక రేటును వసూలు చేస్తున్నాయి. ఇంటి రుణం పెద్ద మొత్తమే కాకుండా దీర్ఘకాలం పాటు అధిక వడ్డీతో కూడిన ఈఎంఐ చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల రుణ కాలవ్యవధికి రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 10% నుంచి 9%కి తగ్గితే, ఈఎంఐ రూ.53,730 నుంచి రూ.50,713కు తగ్గుతుంది. దీనివల్ల రుణ కాలవ్యవధిలో రూ.5,43,047 వడ్డీ భారం తగ్గుతుంది. రుణంపై 1% వడ్డీ రేటు తగ్గినా కూడా రుణగ్రహీతకు ఈఎంఐ తగ్గి చాలా మెరుగైన ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ తగ్గుదల వల్ల దీర్ఘకాలంలో చాలా మొత్తం ఆదా అవుతుంది. ఫిక్స్‌డ్‌ రేటు రుణాన్ని ఫ్లోటింగ్‌కు మార్చడం వల్ల పెనాల్టీని చెల్లించినప్పటికీ, దీర్ఘకాలానికి ఈఎంఐ తగ్గడం వల్ల రుణగ్రహీతకు ఆర్థికపరమైన మేలు జరుగుతుంది.

డౌన్‌ పేమెంట్‌!
ఇంటిపై రుణం తీసుకునేటప్పుడు అధిక డౌన్‌ పేమెంట్‌ చెల్లించడం వల్ల రుణ మొత్తం గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది మీ హోమ్‌ లోన్‌ ప్రిన్సిపల్‌ మొత్తాన్ని తగ్గించి, మొత్తం వడ్డీ చెల్లింపులను తగ్గిస్తుంది. రుణ కాలవ్యవధి ఎంపికను బట్టి, ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details