Hindenburg Tweet on India : అదానీ గ్రూప్ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేసింది. ఆ విషయంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజాగా మరో పోస్ట్ చేసింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని రాసుకొచ్చింది. దీంతో హిండెన్‌బర్గ్ మరోసారి భారత మార్కెట్లలో బాంబు పేల్చనుందా? అని నెట్టింట్లో ఆందోళన మొదలైంది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చే నివేదిక ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్‌బర్గ్ ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హిండెన్‌బర్గ్ పెట్టిన ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అదానీ గ్రూప్‌పై నివేదిక
అదానీ గ్రూప్ తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని ఆరోపిస్తూ 2023 జనవరి 23న హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేసింది. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని నివేదికలో పేర్కొంది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు తెలిపింది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు షెల్ కంపెనీలను నియంత్రిస్తోందని వివరించింది. వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు అదానీ గ్రూపు పాల్పడుతోందని నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు ఆ సమయంలో దారుణంగా పతనమయ్యాయి.