Health Insurance Portability Pros And Cons :ఆరోగ్య బీమా పాలసీ మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మారిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేకపోవచ్చు. లేదా సదరు ఇన్సూరెన్స్ కంపెనీ పనితీరు మీకు నచ్చకపోవచ్చు. లేదా తక్కువ ప్రీమియానికే ఎక్కువ రక్షణ దొరకవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్య బీమా పాలసీని మరో సంస్థకు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీన్నే బీమా పరిభాషలో 'పోర్టబిలిటీ' అంటారు. మరి మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మరో సంస్థకు మార్చాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీలో ఉన్న ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Health Insurance Portability Benefits :భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీని మరో సంస్థకు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య పోటీని పెంచడం, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ పోర్టబిలిటీ సదుపాయాన్ని తీసుకువచ్చింది. అంటే మీ ఆరోగ్య బీమా పాలసీని A అనే సంస్థ నుంచి B అనే మరో సంస్థకు మార్చుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా ఇప్పటి వరకు పాత పాలసీ అందించిన అన్ని ప్రయోజనాలు, వ్యవధిని కొనసాగిస్తూ, కొత్త సంస్థ నుంచి అదనపు ప్రయోజనాలతో పాలసీని తీసుకునేందుకు వీలవుతుంది.
ఎప్పుడు పోర్ట్ చేయాలి?
ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే, పాలసీ పునరుద్ధరణకు 45 రోజుల ముందే అవసరమైన అన్ని చర్యలు ప్రారంభించాలి. ఇప్పుడు చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, అలాగే గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పాలసీని పోర్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మంచిది. తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత, కొత్త సంస్థ మీకు పాలసీని ఇవ్వకుంటే తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఏ సందర్భాల్లో
- మీ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలు, షరతులు మీకు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే సంస్థను మార్చుకునేందుకు ప్రయత్నించాలి.
- పాలసీ విలువ తక్కువగా ఉన్నప్పుడు, అదే ప్రీమియానికి ఇతర సంస్థలు అధిక రక్షణను ఇస్తున్న సందర్భాల్లోనూ పోర్ట్ చేసుకోవచ్చు.
- మీకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రులు బీమా సంస్థ నెట్‌వర్క్ జాబితాలో లేనప్పుడు, ఆ సంస్థను మార్చుకునే విషయాన్ని పరిశీలించాలి.