తెలంగాణ

telangana

ETV Bharat / business

'త్వరలోనే GST రేట్లు తగ్గింపు!- పాత పన్ను విధానాన్ని రద్దు చేయం' - NIRMALA SITHARAMAN ON GST SLABS

త్వరలోనే జీఎస్​టీ రేట్లు, శ్లాబ్‌లు తగ్గిస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి- పాత పన్ను విధానాన్ని రద్దు చేయమని స్పష్టం

Nirmala Sitharaman on GST slabs
Union Finance Minister Nirmala Sitharaman (PTI)

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 6:32 PM IST

Nirmala Sitharaman on GST slabs :వస్తు,సేవల పన్ను (జీఎస్​టీ)కు సంబంధించిన శ్లాబ్‌ల సంఖ్యతో పాటు రేట్లను తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో జీఎస్​టీ శ్లాబ్‌లు, రేట్లు ఉండేలా వస్తు,సేవల పన్ను వ్యవస్థ నిర్మాణంపై సమీక్ష తుది దశకు చేరుకుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే జీఎస్​టీ మండలి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన 2025 రౌండ్‌ టేబుల్ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ వివరాలను వెల్లడించారు.

'సామాన్య ప్రజల కోసమే'
'జీఎస్​టీ రేట్లను సరళతరంగా, హేతుబద్ధంగా మార్చే ప్రక్రియ వాస్తవానికి మూడేళ్ల క్రితమే మొదలైంది. అయితే కాలక్రమంలో జీఎస్​టీ పరిధి పెరిగింది. అందుకే దానిపై సమీక్ష పూర్తి కావడానికి ఇంత సమయం పట్టింది. జీఎస్​టీ రేట్లపై లోతుగా సమీక్షించమని నేను మంత్రుల బృందానికి సూచించా. ఎందుకంటే ఆ రేట్లు, సామాన్య ప్రజలు రోజూ వినియోగించే ఎన్నో వస్తువులు, ఉత్పత్తులతో ముడిపడినవి. ఇదే మాకు సరైన అవకాశం. తప్పకుండా జీఎస్​టీ రేట్లను తగ్గించి తీరుతాం. త్వరలోనే దీనిపై జీఎస్​టీ మండలి నిర్ణయం తీసుకుంటుంది' అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.

ఆర్థిక మంత్రి నిర్మల ఛైర్మన్‌గా ఉండే జీఎస్​టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. జీఎస్​టీ శ్లాబ్‌ల సంఖ్యను తగ్గించి, జీఎస్​టీ రేట్లలో మార్పులు చేసేందుకు పలువురు మంత్రులతో ప్రత్యేక బృందాన్ని జీఎస్​టీ మండలి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జీఎస్​టీకి సంబంధించి నాలుగు శ్లాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 5శాతం, 12శాతం, 18శాతం, 28శాతం చొప్పున జీఎస్​టీ రేట్లను విధిస్తున్నారు. లగ్జరీ ఉత్పత్తులు/సేవలు, సమాజానికి హాని కలిగించే వస్తువులపై 28శాతం జీఎస్​టీ విధిస్తున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలపై 5శాతం జీఎస్​టీ వేస్తున్నారు.

దిల్లీ ఎన్నికలను కోసమేనా?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీఎస్​టీపై నిర్ణయం తీసుకుంటున్నారనే ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ఖండించారు. 'దేశ ప్రజల బాగును ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. అందుకే ఈ మార్పులన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. వ్యవస్థాగతమైన మందగమనం అనేది లేదు. ఇక మూలధన వ్యయాలు తగ్గాయని అంటున్నారు. అవి అసలు తగ్గలేదు. వాస్తవానికి అవి పెరిగి రూ.11.21 లక్షల కోట్లకు చేరాయి. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో ఇది 4.3 శాతం వరకు ఉంటుంది' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

పాత పన్ను విధానాన్ని రద్దు చేయం
పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పన్నుల ఫైలింగ్‌ విధానాన్ని సరళతరం చేసే ఏకైక ఉద్దేశంతో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. కొత్తగా తీసుకురాబోయే ఆదాయపు పన్ను చట్టం గురించి ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. 1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టం వస్తుందన్నారు. దీనికి సంబంధించిన బిల్లును మరికొద్ది రోజుల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదిస్తామని నిర్మల వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details