MTNL OPERATIONS TO BSNL :ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెట్(ఎంటీఎన్ఎల్) కార్యకలాపాలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. తొలుత ఎంటీఎన్ఎల్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విలీన మార్గం ద్వారా కన్నా, ఒప్పందం ద్వారా ఎంటీఎన్ఎల్ బాధ్యతలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత రుణభారంతో ఉన్న ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలను ఒప్పందం ద్వారా బీఎస్ఎన్ఎల్కు అప్పగించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎంటీఎన్ఎల్కు భారీ స్థాయిలో రుణభారం ఉన్న కారణంగా బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు సమాచారం. ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలు బీఎస్ఎన్ఎల్కు అప్పగించే ప్రతిపాదనను కార్యదర్శుల కమిటీ ముందు ఉంచి, ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
"ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంటీఎన్ఎల్ నష్టాల్లో కొనసాగుతోంది. ఎంటీఎన్ఎల్ వద్ద తగినన్ని నిధులు లేకపోవడం వల్ల బాండ్ హోల్డర్లకు వడ్డీ చెల్లించలేకపోతోంది. 7.59 శాతం MTNL యొక్క బాండ్ సిరీస్‌కి సంబంధించి రెండవ సెమీ వార్షిక వడ్డీని జూలై 20, 2024న చెల్లించాల్సి ఉంటుంది. ఎంటీఎన్ఎల్, టెలికాం డిపార్ట్‌మెంట్, బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్‌ల మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం (TPA) ప్రకారం ఎంటీఎన్ఎల్ సెమీ వార్షిక వడ్డీని గడువు తేదీకి 10 రోజుల ముందు చెల్లించాలి." అని ఓ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.