Google Wallet Launched In India : టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 'గూగుల్ వాలెట్'ను లాంఛ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్‌లు, కీలు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.
Google Wallet Vs Google Pay
ఈ గూగుల్ వాలెట్‌ను నేరుగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది 'గూగుల్ పే' యాప్ కంటే చాలా భిన్నమైన సేవలు అందిస్తుంది. గూగుల్ పే ద్వారా మనం కేవలం ఆర్థిక నిర్వహణ మాత్రమే చేయగలుగుతాం. అంటే దానిని బేసిక్ పేమెంట్ యాప్‌గా మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. కానీ గూగుల్ వాలెట్ అనేది పేమెంట్ యాప్ కాదు. గూగుల్ వాలెట్లో మీ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ ఐడీ లాంటి వాటిని డిజిటల్ వెర్షన్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మీరు క్రెడిట్, డెబిట్ కార్డ్స్ కోసం ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
రూమర్స్ నిజం అయ్యాయి!
గూగుల్ వాలెట్ ఇప్పటికే చాలా దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్‌లోనూ దీనిని లాంఛ్ చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు అయితే థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా గూగుల్ వాలెట్ సేవలను వినియోగిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు దీనిని గూగుల్ అధికారికంగా ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.