తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్ ఉద్యోగికి 300 శాతం శాలరీ హైక్- కొత్తగా 1000 మంది తొలగింపు!

Google Employee Salary Hike : తమ సంస్థలో పనిచేస్తున్న ఓ విలువైన నిపుణుడిని వదులుకోలేక ఏకంగా అతడి జీతాన్ని 300 శాతానికి పెంచేందుకు నిర్ణయించింది టెక్​ దిగ్గజం గూగుల్​. ఈ విషయాన్ని పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్‌ ఇటీవల పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 2:22 PM IST

Google Offered 300 Percent Salary Hike To Employee
Google Offered 300 Percent Salary Hike To Employee

Google Employee Salary Hike :గూగుల్​లో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న ఒక సమర్ధవంతమైన నిపుణుడిని వేరే సంస్థలోకి వెళ్లనివ్వకుండా అతడి జీతాన్ని ఏకంగా 300 శాతానికి పెంచేందుకు సిద్ధమయింది ఆ సంస్థ. ఈ విషయాన్ని పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్‌ ఇటీవల పాల్గొన్న బిగ్‌ టెక్నాలజీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. కాగా, సదరు నిపుణుడు పర్‌ప్లెక్సిటీ ఏఐకి మారాలనుకున్నప్పుడు, జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా అతడు ఉద్యోగం మారకుండా గూగుల్‌ నిలువరించిగలిగిందని శ్రీనివాస్‌ తెలిపారు.

ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్‌ 'ప్రధాన టెక్‌ కంపెనీలు తమ కీలక నిపుణులను అట్టేపెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని' తెలిపేందుకు పైసంఘటనను ఉదాహరణగా వివరించారు. 'ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదు, సెర్చ్‌ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది' అని పేర్కొన్నారు పర్‌ప్లెక్సిటీ సీఈఓ. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే పలు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని, సాంకేతిక పరిశ్రమలో లేఆఫ్స్​ గురించి వచ్చిన ప్రస్తావన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Layoffs In 2024 :గూగుల్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు ఈ ఏడాది ప్రారంభం నుంచి పెద్ద ఎత్తున తమ ఉద్యోగులకు లేఆఫ్స్​​ ప్రకటిస్తున్నాయి. టెక్ లేఆఫ్స్​ ట్రాకర్ Layoffs.fyi ప్రకారం జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 34,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఆయా సంస్థలు ఉద్వాసన పలికినట్లు సమాచారం.

Google Lays Offs : మరోవైపు, గూగుల్​లోనూ ఉద్యోగుల తొలగింపు జోరుగా సాగుతోంది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఇప్పటిదాకా వివిధ విభాగాల్లోని 1000 మందికి పైగా ఉద్యోగులను గూగుల్ తొలగించినట్లు తెలిసింది. అయితే కంపెనీని బలోపేతం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని గత నెలలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. గతేడాది 12వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్​ ప్రకటించింది గూగుల్. ఆ తర్వాత దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్​ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. అయినా, తాజాగా ఉద్యోగులను తొలగించడం గమనార్హం.

రూ.70,000 బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!

ఎయిర్​టెల్​​ యూజర్లకు గుడ్​న్యూస్ ​- అమెజాన్ ప్రైమ్​తో నయా ప్రీపెయిడ్​ ప్లాన్స్​!

ABOUT THE AUTHOR

...view details