Floater Credit Card Benefits :నేటి కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఇవి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఒక కుటుంబం/ చిన్న బిజినెస్/ చిన్న గ్రూప్ మొత్తం ఉపయోగించడానికి వీలుగా ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా! అందుకే ఇప్పుడు ప్రముఖ బ్యాంకులు అన్నీ ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. వీటి ద్వారా సింగిల్ అకౌంట్ ఉపయోగించి చాలా మంది యూజర్లు ఒక క్రెడిట్ కార్డులు ఉపయోగించడానికి వీలవుతుంది. మరి ఈ ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్స్ ఎలా పనిచేస్తాయి? వీటిని ఉపయోగించడం మంచిదేనా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక అకౌంట్‌తో లింకై ఉంటుంది. దీనికి ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఈ అకౌంట్‌లోని యూజర్లు అందరికీ వేర్వేరు క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. దీంతో ఒకేసారి అనేక మంది వ్యక్తులు ఈ ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
ఉదాహరణకు, ఒక ఫ్లోటర్ కార్డ్‌పై రూ.1లక్ష రూపాయల వరకు క్రెడిట్ పరిమితి ఉంది అనుకుందాం. ఒక వ్యక్తి అందులో రూ.50వేలు వరకు ఉపయోగించుకున్నారు. అప్పుడు మిగతా యూజర్లు అందరూ కలిసి మిగతా రూ.50వేలు పరిమితి వరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు.
యూజర్లు అందరి వద్ద వేర్వేరు క్రెడిట్ కార్డులు ఉన్నప్పటికీ, అవన్నీ ఒకే ఖాతాతో అనుసంధానమై ఉంటాయి. అందుకే ఆర్థిక లావాదేవీలను సులువుగా ట్రాక్ చేయడానికి, మేనేజ్ చేయడానికి వీలవుతుంది.
బిల్లింగ్ సంగతేంటి?
ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లో ఎంత మంది యూజర్లు ఉన్నప్పటికీ ఒకే బిల్లు జనరేట్ అవుతుంది. అయితే వేర్వేరు యూజర్లు ఎంత మేరకు క్రెడిట్ వాడుకున్నారో ఖాతా చేసి తెలుసుకోవచ్చు.