FASTag KYC Deadline Extended :జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 29లోపు కచ్చితంగా ప్రతిఒక్కరూ ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ గడువులోగా కేవైసీ కంప్లీట్ చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది.
ఫాస్టాగ్ వెబ్సైట్లో లేదా నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) వెబ్సైట్లో KYC ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని NHAI తెలిపింది. ఇంతకు ముందు జనవరి 31 వరకు ఫాస్టాగ్ కేవైసీ డెడ్‌లైన్ విధించింది. కానీ వాహనదారుల సౌలభ్యం కోసం మరలా ఆ గడువును నెల రోజులపాటు పొడిగించింది. అందుకే ఇప్పుడు వాహనదారులు తమ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను ఎలా కంప్లీట్ చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీరు మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు https://fastag.ihmcl.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీ వివరాలను నమోదు చేసి, పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ అది ఇన్కంప్లీట్గా ఉంటే, అక్కడే కేవైసీని అప్డేట్ కూడా చేసుకోవచ్చు.
సాధారణంగా వివిధ బ్యాంకులు ఫాస్టాగ్‌లు జారీ చేస్తుంటాయి. అందువల్ల మీరు https://www.netc.org.in/request-for-netc-fastag లింక్‌ను ఓపెన్ చేయాలి. మీకు ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్‌ను ఎంచుకోవాలి. అక్కడే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.