Gautam Adani Bribery Case Updates : అమెరికాలో నమోదైన 'లంచం' కేసు సహా, కెన్యా విమానాశ్రయం విస్తరణ ఒప్పందం రద్దు అంశాలపై వివరణ ఇవ్వాలని అదానీ గ్రూపు సంస్థలను స్టాక్ ఎక్స్చేంజీలు కోరాయి. అయితే ఇప్పటి వరకు అదానీ గ్రూప్ - అమెరికా లంచం కేసు, కెన్యా విమానాశ్రయ విస్తరణ ఒప్పందం రద్దుపై స్టాక్ ఎక్స్చేంజీలక ఎలాంటి వివరాలు అందించకపోవడం గమనార్హం.
ఖండిస్తున్నాం!
స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఎలాంటి వివరణ ఇవ్వని అదానీ గ్రూప్ - అమెరికాలో నమోదైన కేసుపై స్పందించిన అదానీ గ్రూపు లంచం ఆరోపణలను ఖండించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొంది. న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
మోదీ అండతోనే అదానీ వృద్ధి!
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాల వల్ల నేరుగా లబ్దిపొందుతున్నది గౌతమ్ అదానీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. అందుకే నిష్పక్షపాతంగా నిజాలు వెలికితీసేందుకుగాను అమెరికాలో నమోదైన కేసుపై జేపీసీ వేయాలని ఆయన సూచించారు. భారత్‌లో ప్రైవేటైజేషన్ వల్ల ఎక్కువగా అదానీ ఎలా లబ్దిపొందుతున్నారో చెప్పాలని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. దేశంలో పోర్టులన్నీ అదానీ నియంత్రణలోకి ఎలా వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. దేశంలో అన్ని విమానాశ్రయాలను అదానీ ఎలా నియంత్రించగలుగుతున్నారని జైరాం రమేష్ సూటిగా ప్రశ్నలు సంధించారు. దేశంలో సిమెంట్ ఇండస్ట్రీని అదానీ ఎలా శాసించగలుగుతున్నారని అడిగారు. 2023 జనవరి నుంచి అదానీపై జేపీసీ వేయాలని తాము అడుగుతున్నట్లు జైరాం రమేష్ గుర్తుచేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో అదానీ ఏకచత్రాధిపత్యం ఎలా సాగుతుందో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసును విపక్షాలపై నెట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని జైరాం రమేష్ దుయ్యబట్టారు. ఈ అంశంపై దర్యాప్తు చేయించాలని ఆయన సవాల్ విసిరారు.
"అదానీపై ఆరోపణలు చేసింది మేము కాదు అమెరికా సంస్థ. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసింది. సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్-ఎస్‌ఈసీ విచారణ జరిపింది. దాని ఆధారంగా 54 పేజీలతో నేరారోపణ చేసింది. 70వ పేరాగ్రాఫ్‌లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-సెకీ పూర్తిగా అదానీ చేతుల్లో కబ్జాకు గురైందని రాశారు. సెకీ ఏం చేయాలో అదానీ నిర్ణయిస్తున్నారు. కానీ సెకీ గురించి బీజేపీవాళ్లు మాట్లాడటంలేదు. విపక్ష పాలిత రాష్ట్రాల్లో జరిగిందంటున్నారు. దర్యాప్తు చేయించండి. దర్యాప్తు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో దర్యాప్తు చేయండి. 2019లో జమ్మూకశ్మీర్‌లో ఇది జరిగింది. మీరే కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. మీ లెఫ్ట్‌నెంట్ గవర్నరే ఉన్నారు. దర్యాప్తు చేయించండి. దర్యాప్తుపై మేము వెనక్కిపోవడంలేదు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు.