EPS Pension Rules :ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 1995 నవంబర్‌లో 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95' (EPS 95) స్కీమ్‌ను లాంఛ్ చేసింది. దీనిని ప్రధానంగా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కోసం తీసుకురావడం జరిగింది. ఈపీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి 58 ఏళ్లు పూర్తయిన తరువాత పెన్షన్ వస్తుంది. కానీ మీరు కోరుకుంటే 50 ఏళ్లకే పెన్షన్ పొందే ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే?
ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన తరువాత ఈపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఈపీఎఫ్ ఖాతాలో యాజమాన్యం వాటాగా ఉద్యోగి బేసిక్ సాలరీ+ డియర్నెస్ అలవెన్స్‌లో 12 శాతాన్ని జమ చేయడం జరుగుతుంది. దాదాపు ఇంతే మొత్తాన్ని ఉద్యోగి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగి చెల్లించిన సొమ్ము మొత్తం ప్రావిడెంట్ ఫండ్‌కి జమ అవుతుంది. కానీ ఈపీఎఫ్ఓ నియమాల ప్రకారం, యాజమాన్యం చెల్లించిన 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్‌లోకి జమ అవుతుంది. మిగతా 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి వెళుతుంది. మీరు రిటైర్ అయిన తరువాత ఈ ఈపీఎస్ కార్పస్ నుంచే మీకు పెన్షన్ అందిస్తారు.
కండిషన్స్ వర్తిస్తాయి!
ఈపీఎస్ కింద మీకు పెన్షన్ రావాలంటే, మీరు కనీసం 10 ఏళ్లపాటు ఉద్యోగం చేసి ఉండాలి. అప్పుడే మీరు మినిమం పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.7500 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది.
పెన్షన్ కాలిక్యులేషన్
కనీసం 10 ఏళ్లు సర్వీస్ చేసిన ఉద్యోగి ఈపీఎఫ్ ఎర్లీ పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే సదరు ఉద్యోగి వయస్సు 50-58 ఏళ్ల మధ్య ఉండాలి. 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు పెన్షన్ పొందడానికి వీలుండదు.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమింటే? 58 ఏళ్ల కంటే ముందే మీరు పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే, మీకు వచ్చే పింఛన్ ఒక్కో ఏడాదికి 4 శాతం చొప్పున తగ్గుతుంది. ఉదాహరణకు మీరు 57 ఏళ్ల వయస్సులో పెన్షన్ తీసుకోవాలంటే 4 శాతం పింఛన్ తగ్గుతుంది. అదే మీరు 56 ఏళ్ల వయస్సులోనే పింఛన్ తీసుకోవాలంటే 4%+4% పెన్షన్ తగ్గుతుంది. ఇలా మీకు వచ్చే పెన్షన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది.