తెలంగాణ

telangana

ఐటీఆర్​ ఫైలింగ్​లో ఏమైనా పొరపాట్లు చేశారా? వెంటనే సరిదిద్దుకోండిలా! - How To Correct ITR Mistakes

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 1:13 PM IST

How To Correct ITR Mistakes : ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు మరికొద్ది రోజులే గడువు ఉంది. ఇప్పటికే చాలా మంది తమ ఐటీఆర్​ను దాఖలు చేశారు. అయితే ఇలా దాఖలు చేసిన ఐటీఆర్​లో ఏమైనా తప్పులు లేదా పొరపాట్లు ఉంటే, రీఫండ్ రావడం కష్టమవుతుంది. అందుకే మీరు దాఖలు చేసిన ఐటీఆర్​లో ఏమైనా పొరపాట్లు, తప్పులు ఉంటే వెంటనే వాటిని సరిచేసుకోవడం మంచిది.

Top mistakes to avoid when filing Income Tax returns
Did you make a mistake while filing ITR? (Getty Images)

How To Correct ITR Mistakes : ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) సమర్పించేందుకు మరికొద్ది రోజులే గడువు ఉంది. కనుక ఇంకా ఐటీఆర్​ దాఖలు చేయనివారు, వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిది. అయితే ఇప్పటికే ఐటీఆర్​ దాఖలు చేసిన చాలా మందికి సంబంధించిన ఫారం-16, ఫారం-26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో వ్యత్యాసాలున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే, రీఫండ్ రావడం చాలా కష్టమైపోతుంది. అందుకే మీరు దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నుల్లో ఏమైనా వ్యత్యాసాలు, తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవడం చాలా మంచిది.

ఐటీఆర్​ల విషయంలో, ఏఐఎస్‌లో ఉన్న సమాచారం ఎంతో కీలకం అవుతుంది. కనుక మీరు దాఖలు చేసిన ఐటీఆర్​లో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక లావాదేవీల వివరాలు
పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీలు అన్నీ వార్షిక సమాచార నివేదికలో కనిపిస్తాయి. మీకు వచ్చిన ఆదాయం, మీ పెట్టుబడులు, బ్యాంకు ఖాతా వివరాలు సహా, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ దీనితో చూసుకోవచ్చు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఈ సమాచారం సరిపోతుంది. అయితే, అరుదుగా ఇందులోనూ కొన్ని పొరపాట్లు దొర్లే అవకాశం ఉంటుంది. ఎలా అంటే?

  • ఒకే ఆదాయం రెండు సార్లు నమోదు కావడం
  • మీకు సంబంధం లేని ఆదాయం వచ్చినట్లు చూపించడం.
  • మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌)లో పొరపాట్లు
  • అధిక విలువగల లావాదేవీలు (హై వాల్యూ ట్రాన్సాక్షన్స్​) నిర్వహించినట్లు పేర్కొనడం
  • బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వడ్డీ రాకున్నా, వచ్చినట్లు నమోదుకావడం
  • షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లకు సంబంధించిన లావాదేవీల వివరాల్లో పొరపాట్లు ఉండడం

సరిచేసుకోవడం ఎలా?

  • ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌కు వెళ్లాలి.
  • వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌) ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • ఏఐఎస్‌ పార్ట్‌-ఏ, పార్ట్‌-బీలను చూడాలి.
  • తప్పు సమాచారాన్ని గుర్తించి, దానిని మార్చుకునేందుకు ఉన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అక్కడ మీకు చాలా ఆప్షన్​లు కనిపిస్తాయి. అవి:
  1. సమాచారం సరైనది
  2. సమాచారం ఇతర పాన్‌ లేదా ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది.
  3. లావాదేలు రెండుసార్లు కనిపిస్తున్నాయి.
  4. ఇక్కడ పేర్కొన్న సమాచారాన్ని తిరస్కరిస్తున్నాం.
  • ఇలా పలు ఐచ్ఛికాలు కనిపిస్తాయి. అందులో సరైన దానిని ఎంచుకొని, మీ ఆభ్యర్థనను సమర్పించాలి.
  • అప్పుడు ఆదాయపు పన్ను విభాగం వారు, సంబంధిత లావాదేవీలను ధ్రువీకరించుకొని, ఏఐఎస్‌లో సరిచేస్తారు.
  • ఒక వేళ ఫారం 26ఏఎస్‌లో పన్ను వివరాలు సరిపోలకపోతే, వెంటనే దాన్ని మీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవాలి.

అంతర్జాతీయ లావాదేవీలు
మీరు విదేశాలకు డబ్బు పంపించడం, లేదా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం లాంటివి చేస్తే ఆ వివరాలు కూడా ఏఐఎస్‌లో కనిపిస్తాయి. కనుక, వీటిని కూడా జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి. ఒక వేళ మీరు చేయని లావాదేవీలు కనిపిస్తే, వెంటనే వాటిని సరిచేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.

ప్రస్తుతం చాలా విదేశీ వెబ్‌సైట్లు మన క్రెడిట్‌/డెబిట్‌ కార్డు చెల్లింపులను ఆమోదిస్తున్నాయి. కనుక వీటిలో కొనుగోలు చేసినప్పుడు, ఈ వివరాలు కూడా ఏఐఎస్‌లో నమోదవుతాయి. ఇలాంటప్పుడు పన్ను వర్తించే ఆదాయం ఉన్నవారు, కచ్చితంగా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. కనుక విదేశాలకు డబ్బు పంపించినా, లేదా అక్కడి నుంచి ఆదాయం వస్తున్నా, వాటికి సంబంధించిన ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవడం తప్పనిసరి.

ఎలా గుర్తించాలి?
ఐటీ డిపార్ట్​మెంట్​కు చెందిన ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ నుంచి మీ ఏఐఎస్, ఫారం-26ఏఎస్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వీటితోపాటు మీ ఫారం-16ను కూడా దగ్గర పెట్టుకోవాలి. ఈ మూడింటిలోని సమాచారాన్ని ఒకసారి పోల్చి చూసుకోవాలి. నివేదించిన ఆదాయ వివరాలన్నీ సరిగా ఉన్నాయా, లేదా చూసుకోవాలి. టీడీఎస్, టీఎసీఎస్‌లలో ఏమైనా వ్యత్సాసాలు ఉన్నాయా, లేదా అని తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే, వాటిని వెంటనే సరిచేసుకోవాలి.

ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కావాలా? ఆ 'బీమా పాలసీ' తీసుకోవడం మస్ట్​! - Critical Illness Insurance Benefits

స్టెప్​-అప్​ Vs స్టెప్​-డౌన్ హోమ్ లోన్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్? - Step Up Home Loan

ABOUT THE AUTHOR

...view details