తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏడాదిలో రూ.20వేలు పెరిగిన బంగారం ధర - మరి ఇప్పుడు గోల్డ్ కొనాలా? వెయిట్ చేయాలా? - GOLD PRICE FORECAST

బంగారంపై ఇన్వెస్ట్ చేయాలా? 2025లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయంటే?

Gold Price Forecast
Gold Price Forecast (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 5:32 PM IST

Gold Price Forecast :

  • 2023 ధనత్రయోదశినాడు 10 గ్రాముల బంగారం ధర రూ.60,700
  • 2024 అక్టోబర్ 25న 10 గ్రాముల బంగారం ధర రూ.80,600
  • మరి 2025 ధంతేరాస్‌ నాటికి బంగారం ధర = ?

భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చితే దేశంలో బంగారం ధరలు దాదాపు 30 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్‌) ధర సుమారుగా రూ.80,600 వరకు ఉంది. గత కొన్నివారాలుగా కాస్త అటుఇటుగా బంగారం ఈ ధర వద్దే కదలాడుతోంది. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇకపై ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది! మరి ఇలాంటి పరిస్థితిల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ బులియన్‌ అండ్ జువెలరీస్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) డేటా ప్రకారం, గత దీపావళి (నవంబర్ 10) నుంచి ఇప్పటికి 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 నుంచి రూ.80,600 వరకు పెరిగింది.

బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా?
ఐబీజేఏ 2024 అక్టోబర్‌ 24న పబ్లిష్ చేసిన రేట్ల ప్రకారం, 24 క్యారెట్ బంగారం గ్రాము ధర రూ.7,825; అలాగే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము ధర రూ.7,637కు పెరిగింది. దీనికి తోడు గత మూడేళ్లలో 'ఎంసీఎక్స్‌ గోల్డ్' (MCX Gold) రెండు అంకెల రాబడిని అందించింది. దీనిని బట్టి దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారానికి ఉన్న ఆకర్షణ ఏమిటో మనకు తెలుస్తుంది.

బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్‌-హమాస్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు బంగారం ఒక నమ్మకమైన పెట్టుబడి సాధానంగా మారింది. అందుకే అంతర్జాతీయంగా బంగారం ధరలు వివరీతంగా పెరుగుతున్నాయి.

ఇక స్పాట్‌ గోల్డ్ ధర విషయానికి వస్తే, 2007 నుంచి ఇప్పటి వరకు దాదాపు 33 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారుల్లో ఉన్న ఆశావాద దృక్పథాన్ని తెలియజేస్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతుండడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌ 50 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో - భవిష్యత్‌లో గోల్డ్‌ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా 2022 నుంచి భారీగా తన బంగారు నిల్వలను పెంచుకుంటోంది. చైనా ఇప్పటి వరకు 2,262 టన్నుల మేర గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంది. యాక్సిస్ సెక్యూరిటీస్‌ లేటెస్ట్ రిపోర్ట్‌ ప్రకారం, ఈ ట్రెండ్ 2025 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది బులియన్ మార్కెట్‌కు ఎంతో లాభదాయకంగా ఉండనుంది. కనుక బంగారంపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి, ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.

బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చా?
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, చైనా సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారు నిల్వలు పెంచుకుంటూ ఉండడం, ఫెడరల్ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లపై కోత విధించడం మొదలైన వాటి వల్ల, ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించే అవకాశం ఉంది. కనుక పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారంపై ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం రేట్లు మరింతగా పెరుగుతాయి. కొంత మంది ఆర్థిక నిపుణుల ప్రకారం, 2025లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగనుంది. కనుక బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది!

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిపోర్ట్ ప్రకారం, 'ప్రస్తుతం బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే రూ.72,000 - రూ.75,000 ధరల వద్ద బంగారం కొనుగోలు చేస్తే, వచ్చే దీపావళి(ధంతేరాస్‌)కి బంగారం ధర రూ.85,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.'

ABOUT THE AUTHOR

...view details