Credit Card RBI Guidelines : క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నవారికి గుడ్‌న్యూస్. క్రెడిట్‌కార్డు బిల్లింగ్ సైకిల్‌కు సంబంధించి ప్రారంభ లేదా ముగింపు తేదీలు ఒకసారి మార్చుకునే అవకాశాన్ని కస్టమర్‌కు కల్పించింది ఆర్బీఐ. అదే విధంగా బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకునేందుకు వీలుగా మల్టీపుల్ ఛానెల్స్ ఉపయోగించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు క్రెడిట్ కార్డు ఇష్యూయెన్స్ అండ్ కండక్ట్ డైరెక్షన్స్ 2022కు సవరణ చేస్తూ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఈ రూల్స్ 2024 మార్చి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
సాధారణంగా క్రెడిట్‌కార్డు బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకోవడం అంత సులభమేమీ కాదు. క్రెడిట్ కార్డును జారీ చేసేటప్పుడే బిల్లింగ్ సైకిల్ సంబంధిత తేదీలను సంస్థలు ముందే నిర్ణయిస్తాయి. అయితే తాజాగా ఆర్బీఐ జారీ చేసిన కొత్త క్రెడిట్ కార్డుల నియమాల ప్రకారం క్రెడిట్ కార్డు హోల్డర్ బిల్లింగ్ సైకిల్ తేదీలను కనీసం ఒకసారి మార్చుకునే అవకాశం లభించనుంది. బిల్లింగ్ సైకిల్ ప్రారంభ తేదీ నుంచి గడువు తేదీ వరకు వడ్డీ రహిత కాలవ్యవధి ఉంటుంది.
ఈలోపు కార్డు హోల్డర్లు బిల్లు చెల్లించాలి. గడువు తేదీ ముగిసిన తర్వాత చెల్లింపులు చేస్తే అవుట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీ, ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. మల్టీపుల్ ఛానెల్స్ ద్వారా బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకునేందుకు క్రెడిట్‌కార్డుదారులకు అవకాశం కల్పించింది ఆర్బీఐ. హెల్ప్‌లైన్, ఈ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ ఇలా వివిధ మార్గాల ద్వారా బిల్లింగ్ సైకిల్‌ను సవరించుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సవరించింది.
కస్టమర్ల అనుమతి లేకుండా క్రెడిట్‌కార్డు జారీచేస్తే?
ఆర్బీఐ క్రెడిట్ కార్డుల జారీ విషయంలో బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సంస్థలకు మరో కీలక సూచన చేసింది. కస్టమర్ల అంగీకారం తీసుకుని మాత్రమే కార్డులను జారీ చేయాలని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలకు సూచించింది. క్రెడిట్‌కార్డును యాక్టివేట్ చేసే విషయంలో కస్టమర్ నుంచి అంగీకారం రానట్లయితే ఎలాంటి రుసుమూ విధించకుండా ఏడు రోజుల్లోగా క్లోజ్ చేయాలి.