తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ ఫ్యామిలీ కోసం మంచి కార్​ కొనాలా? ఈ టాప్​-10 సేఫ్టీ ఫీచర్స్ మస్ట్​! - TOP 10 CAR SAFETY FEATURES

కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? ఈ 10 సేఫ్టీ ఫీచర్లు ఉండేలా చూసుకోండి - అప్పుడే మీరు​ సేఫ్​!

Car Safety Features
Car Safety Features (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 4:34 PM IST

Top 10 Car Safety Features :కారును కొనేటప్పుడు తప్పకుండా దానిలోని సేఫ్టీ ఫీచర్లను చెక్ చేసుకోవాలి. డ్రైవర్‌, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాట్లు, సౌకర్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కారును డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డుపై పాదచారులకు ఇబ్బందికలగకుండా ఉన్న ఏర్పాట్ల గురించి కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత మేర రోడ్డు ప్రమాదాలను నివారించే డిజైన్ ఉన్న కారును కొనాలి. ఒకవేళ ప్రమాదాలు జరిగినా అతి తక్కువ గాయాలతో బయటపడేలా, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే వాహనాన్నే ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో కారు డిజైనింగ్, ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్​తో పాటు ఇంకొన్ని అంశాలను కూడా మనం పరిశీలించాలి. డ్రైవింగ్ చేసే తీరు, రోడ్డు స్థితి, ట్రాఫిక్ నియమాల పాలన అనే అంశాలపైనా కారు భద్రత ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

కారులో ఉండాల్సిన టాప్-10 భద్రతా ఫీచర్లు

  1. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) : మనం కారుకు అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు వీల్ లాక్ కాకుండా రక్షణ కల్పించే సాంకేతికతను యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల సడెన్ బ్రేక్ వేసిన సమయంలోనూ మనకు కారు స్టీరింగ్‌పై పట్టు సడలదు. కారు జారిపడే ముప్పు తప్పుతుంది.
  2. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) :డ్రైవింగ్ చేసే క్రమంలో కారు స్థిరత్వం, సమతుల్యత కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వ్యవస్థ దోహదం చేస్తుంది. కారు సమతుల్యత గాడితప్పకుండా ఎప్పటికప్పుడు ఇది దిద్దుబాటు చేస్తుంటుంది. ప్రత్యేకించి జారుడు స్వభావం కలిగిన సున్నితమైన రోడ్లపై రాకపోకలు సాగించే క్రమంలో ఈ వ్యవస్థ వల్ల కారుకు భద్రత చేకూరుతుంది.
  3. ఎయిర్ బ్యాగ్స్ (Airbags) :కారు ప్రమాదానికి గురైనప్పుడు లోపల ఉన్న వారందరికీ రక్షణ కల్పించేవి ఎయిర్ బ్యాగులే. కారు సీట్ల ఎదురుగా ఇవి ఉంటాయి. ప్రమాదం జరగగానే ఎయిర్ బ్యాగులు విచ్చుకుంటాయి. ఫలితంగా గాయాల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
  4. ప్రీ టెన్షనర్లతో కూడిన సీట్ బెల్ట్ :కారు ప్రమాదానికి గురైనప్పుడు సీట్లు ముందు వైపునకు కదలడాన్ని/వంగడాన్ని సాధ్యమైనంత మేర నిరోధించేందుకు ప్రీ టెన్షనర్లతో కూడిన సీట్ బెల్ట్ దోహదం చేస్తుంది. దీనివల్ల సీటులో కూర్చున్న వ్యక్తి , సీటులో నుంచి ముందు వైపునకు కదిలే అవకాశాలు తగ్గుతాయి.
  5. ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థ (TCS) : జారుడు స్వభావం కలిగిన రోడ్లపై రాకపోకలు సాగించే క్రమంలో కారులోని వీల్స్ తిరగడాన్ని నియంత్రించేది ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థ. దీనివల్ల డ్రైవరుకు వాహనంపై నియంత్రణ పెరుగుతుంది.
  6. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) : కారు ప్రయాణించే వేగాన్ని బట్టి బ్రేకులు సమర్ధంగా పనిచేయడానికి, వాహనం సమతుల్యతను కాపాడటంలో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
  7. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) :కారులోని టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు డ్రైవర్‌కు అలర్ట్‌లు పంపడమే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ పని. దీనివల్ల వాహన భద్రత మరింత పెరుగుతుంది.
  8. రివర్స్ పార్కింగ్ సెన్సర్లు/కెమెరా :ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో కారును పార్కింగ్ చేయడం పెద్ద సవాలే. ఈ క్రమంలో డ్రైవరు సౌలభ్యం కోసం కారులో రివర్స్ పార్కింగ్ సెన్సర్లు లేదా కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగా కారు వెనుక భాగంలో ఉన్న ఆటంకాలపై అలర్ట్స్ లభిస్తాయి. ఫలితంగా సురక్షితంగా రివర్స్ పార్కింగ్ చేసే వెసులుబాటు లభిస్తుంది.
  9. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) : కారు మరో వాహనంతో ఢీకొనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వ్యవస్థ అలర్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. ప్రమాదాల నుంచి కాపాడుతుంది.
  10. లేన్ డిపార్చర్ వార్నింగ్ వ్యవస్థ (LDW) : కారు తన నిర్దిష్ట లేన్‌ నుంచి బయటికి వచ్చినప్పుడు డ్రైవర్‌కు హెచ్చరిక జారీ చేయడమే లేన్ డిపార్చర్ వార్నింగ్ వ్యవస్థ పని. రోడ్డులోని తప్పుడు లేన్‌లోకి ప్రవేశించి ప్రమాదాల బారిన పడకుండా కారును ఈ వ్యవస్థ కాపాడుతుంది.

ABOUT THE AUTHOR

...view details