తెలంగాణ

telangana

ETV Bharat / business

బిజినెస్‌ క్రెడిట్ కార్డ్‌ Vs పర్సనల్‌ క్రెడిట్‌ కార్డ్‌ - ఏది బెస్ట్ ఆప్షన్‌?

కార్పొరేట్ డిస్కౌంట్స్‌, ట్రావెల్ పెర్క్‌లు సహా - బిజినెస్ క్రెడిట్‌ కార్డ్‌ వల్ల కలిగే బెనిఫిట్స్‌ ఇవే!

Business Credit Cards
Business Credit Cards (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 6:15 PM IST

Business Credit Card Benefits : మీరు వ్యాపారం చేస్తున్నారా? లేదా ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారా? లేదా స్వయం ఉపాధి పొందుతున్నారా? మీ బిజినెస్ కోసం మంచి క్రెడిట్ కార్డ్ తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా బ్యాంకులు వ్యాపారుల కోసం ప్రత్యేకంగా బిజినెస్‌ క్రెడిట్ కార్డులు అందిస్తుంటాయి. వీటి ద్వారా మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్‌పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్స్ పొందవచ్చు.

పర్సనల్ క్రెడిట్ కార్డ్‌ Vs బిజినెస్ క్రెడిట్ కార్డ్‌

  • పర్సనల్ క్రెడిట్ కార్డులు అనేవి వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే. సాధారణంగా వీటి రుణ పరిమితి చాలా తక్కువగా ఉంటుంది. కానీ బిజినెస్‌ క్రెడిట్ కార్డ్ - క్రెడిట్ లిమిడ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.
  • ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, స్థిరమైన ఆదాయం సంపాదిస్తున్నవారికి బ్యాంకులు పర్సనల్ క్రెడిట్‌ కార్డులను ఇస్తాయి. కానీ బిజినెస్‌ క్రెడిట్ కార్డులను బిజినెస్ ఓనర్‌లకు మాత్రమే ఇస్తారు. పైగా దీనికి పర్సనల్ గ్యారెంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
  • పర్సనల్ క్రెడిట్‌ కార్డులను వ్యాపార అవసరాల కోసం వాడకూడదు. బిజినెస్ క్రెడిట్ కార్డులను వ్యక్తిగత అవసరాలకు వాడకూడదు.
  • పర్సనల్ క్రెడిట్ స్కోర్ అనేది మీ బిజినెస్ క్రెడిట్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపించదు. అలాగే మీ బిజినెస్ క్రెడిట్ స్కోర్‌ ప్రభావం- మీ వ్యక్తిగత సిబిల్ స్కోర్‌పై పడదు.

బిజినెస్‌ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు

  • బిజినెస్ క్రెడిట్ కార్డులు కేవలం వ్యాపార అవసరాల కోసం మాత్రమే ఇస్తారు. ఒక వేళ వ్యాపారం కోసం తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోయినా, అది మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపించదు. కనుక పర్సనల్ లోన్‌ తీసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
  • బిజినెస్ కార్డుల క్రెడిట్ పరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా వీటిపై యాడ్‌-ఆన్‌ క్రెడిట్ కార్డులు తీసుకుని తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవ్వవచ్చు. ఉద్యోగులకు ఇచ్చిన క్రెడిట్ కార్డులపై పరిమితిని సెట్‌ చేయవచ్చు. అలాగే వినియోగాన్ని నియంత్రించవచ్చు. దీని వల్ల వ్యాపార నిర్వహణ చాలా సులువు అవుతుంది.
  • వ్యాపారం చేసేవాళ్లు బిజినెస్ పనుల మీద తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. హోటల్స్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో బిజినెస్‌ క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. ఫ్లైట్స్‌, హోటల్ బుకింగ్స్‌పై కార్పొరేట్ డిస్కౌంట్స్‌ లభిస్తాయి. పైగా రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్‌ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • కొన్ని క్రెడిట్ కార్డులు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తాయి. కనుక ప్రయాణాలు చేసేటప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగితే, పరిహారం లభిస్తుంది. దీనితోపాటు విమాన ప్రయాణాలు చేసేటప్పుడు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి.
  • మీ బిజినెస్ ప్రొఫైల్ ఆధారంగా మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకోవచ్చు. కొన్ని సార్లు బోనస్‌ కూడా పొందవచ్చు. కానీ దీని కోసం అధిక మొత్తంలో వార్షిక రుసుములు చెల్లించాల్సి రావచ్చు.
  • బిజినెస్ కార్డుల వల్ల అద్దె, యుటిలిటీ లాంటి స్థిరమైన వ్యాపార ఖర్చులను ట్రాక్ చేయడం చాలా సులువు అవుతుంది. మీ ఆర్థిక స్థితి గురించి, అనవసరపు ఖర్చులు గురించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

జర జాగ్రత్త!
వ్యాపారం చేసేవాళ్లు ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న బిజినెస్ క్రెడిట్ కార్డుల గురించి, వాటిపై విధించే వడ్డీ, యాన్యువల్ ఫీజులు, అపరాధ రుసుములు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అనవసరపు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. అప్పుడే మీకు లాభదాయకంగా ఉంటుంది. లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.

అదనపు క్రెడిట్​ కార్డ్​లను క్లోజ్ చేస్తే - లాభమా? నష్టమా? - Credit Card Closure Pros And Cons

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! - 5 Common Credit Card Mistakes

ABOUT THE AUTHOR

...view details