Halwa Ceremony 2025 : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 24న హల్వా వేడుకను నిర్వహించారు. భారత్‌లో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించినా ముందుగా తీపి పదార్థాలు పంచడం శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం, దిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం- నార్త్ బ్లాక్‌లో హల్వా వేడుక చేస్తుంటారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఆ హల్వాను పంచిపెడతారు.
బడ్జెట్ లాక్-ఇన్ పీరియడ్
హల్వా వేడుకతో బడ్జెట్ లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభం అవుతుంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది - పార్లమెంట్లో దానిని ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోల నిరంతర పర్యవేక్షణలో ఉంటారు. కనీసం వారు ఫోన్ చేయడానికి కూడా వీలుండదు. అత్యవసర సమయాల్లో మాత్రం భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకునే వీలు కల్పిస్తారు.
1950 బడ్జెట్ లీక్
మొదట్లో రాష్ట్రపతి భవన్‌లోనే బడ్జెట్ ప్రతులను ముద్రించేవారు. కానీ 1950లో బడ్జెట్లోని అధిక భాగం ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ బడ్జెట్ సమర్పించిన కొద్ది సేపటి తర్వాత రాజీనామా చేశారు. ఈ ఘటన తరువాత బడ్జెట్ ముద్రణను - మింటో రోడ్‌లోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. దాని తరువాత లాక్-ఇన్ వ్యవధిని కూడా ప్రవేశపెట్టారు. వాస్తవానికి హల్వా వేడుకను కచ్చితంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో తెలియదు. కానీ దాదాపు 1950ల్లోనే ఇది ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.