Budget 2025 Expectations :వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్ పేదరిక నిర్మూలన, ఆహారభద్రత, ఆరోగ్యం, సామాజిక సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేస్తోంది. ఈ బడ్జెట్‌లో కొత్తవి జోడిస్తారా లేక ఉన్న వాటికే కేటాయింపులు పెంచుతారా అనే విషయమై ఆసక్తి నెలకొంది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పేద, మధ్యతరగతిసహా కొన్నివర్గాల్లో ఆశలు రేపాయి. వృద్ధిరేటు తగ్గినందున ఆదాయపు పన్నులో మార్పులు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
పేదల కలలు సాకారం అయ్యేనా?
- దేశంలోని పేదకుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ప్రధానమంత్రి జనారోగ్య పథకం ద్వారా 50 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. దిల్లీ, పశ్చిమ బెంగాల్ మినహా అన్నిరాష్ట్రాలు ఈ పథకాన్ని అమలుచేస్తున్నాయి. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ దీనిని విస్తరించారు. కనుక బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగే అవకాశముంది.
- సౌరవిద్యుత్తును ప్రోత్సహిస్తున్న కేంద్రం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని తీసుకొచ్చింది. పైకప్పులపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన ఈ పథకం ద్వారా 78 వేల చొప్పున ఒక్కో ఇంటికి గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రాయితీ ఇస్తోంది. 2026-27 నాటికి కోటి ఇండ్లు లక్ష్యంగా పెట్టుకోగా, దాదాపు 1.45కోట్లకుపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ పథకం రాయితీ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది.
- గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయటమే లక్ష్యంగా పీఎం ఆవాస్ యోజన ద్వారా 3కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిన కేంద్రం, రెండోవిడతలో హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణప్రాంతాల్లో 2029 నాటికి కోటి మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.
- హామీ లేని రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ముద్రా పథకం 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైంది. తరుణ్ కింద 10లక్షల రుణ పరిమితిని 20లక్షలకు పెంచారు. ఈసారి ఎలాంటి మార్పులు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.
- కొవిడ్ వేళ పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు మార్చి 2020లో గరీబ్ కల్యాణ్ యోజనను ప్రవేశపెట్టారు. లబ్ధిదారులకు నెలకు 5కేజీల బియ్యం, గోధుమలు అందిస్తున్నారు. ఈ పథకాన్ని 2028వరకు పొడిగించిన కేంద్రం ఈ బడ్జెట్‌లో అందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
- రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తున్నారు. ఈసారి ఈ ఆర్థికసాయం పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆశలు రేపుతున్న మోదీ వ్యాఖ్యలు
ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలుఆయా వర్గాల్లో కొత్త ఆశలు రేపాయి. ఈ బడ్జెట్‌లో పేద, మధ్య తరగతితోపాటు మహిళలకు పెద్దపీట వేస్తారనే అంచనాలను పెంచాయి. పేదలు, మధ్య తరగతిపై మహాలక్ష్మికటాక్షం చూపించాలని ప్రధాని పేర్కొనటం ద్వారా సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు. సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడులు, ఆవిష్కరణలే లక్ష్యంగా దూసుకెళుతున్నామని ప్రధాని మోదీ పేర్కొనటంతో ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తారనే ప్రచారం మొదలైంది. ప్రతిఏటా బడ్జెట్ సమయంలో ఆదాయపు పన్ను ఊరట కల్పిస్తారంటూ వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తుంటారు. వృద్ధి నెమ్మదించటంతో ఈసారి మార్పులు ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
స్థిరాస్తి రంగానికి ఊరట లభించేనా?
ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్‌పై గృహ నిర్మాణ రంగం, పట్టణ రంగానికి చెందిన వారు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ రంగం పుంజుకుంటే లక్షలాది మందికి ఉపాధి లభించడం సహా వ్యవస్థలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది. హౌసింగ్ రంగానికి పన్ను మినహాయింపుతో పాటు, రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ల నెలకొన్న వేళ ఈ ఏడాది పద్దుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.