Budget 2024 Key Highlights :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ -2024లో పలు వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా తాయిలాలు ప్రకటించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. వేతన జీవికి ఊరట :బడ్జెట్‌లో వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక మార్పులు చేశారు. పన్ను శ్లాబుల్లో మార్పుతో పాటు, స్టాండర్డ్ డిక్షన్ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లకు రూ.15వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.25వేలకు పెంచారు. క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లకు ప్రోత్సహించేందుకు ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కొత్త పన్ను శ్లాబులు!
- సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
- రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
- రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
- రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
- రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
2. ఉపాధి కల్పన : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించారు. అందుకే మూడు కొత్త పథకాలు ప్రకటించారు. అవి:
- తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనం అందిస్తారు. సంఘటిత రంగంలోని అన్ని రంగాలకు దీన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం కింద గరిష్ఠంగా రూ.15వేలు వరకు అందిస్తారు.
- తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండో పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. గరిష్ఠంగా రూ.1 లక్ష వేతనం ఉన్నవారికి దీనిని వర్తింపజేస్తారు.
- అదనంగా ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్‌ను రీయంబర్స్ చేస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ పథకం వల్ల దాదాపు 50 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా.
3. మహిళా ఉద్యోగులకు హాస్టల్స్
పరిశ్రమల సహకారంతో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే పరిశ్రమల భాగస్వామ్యంతో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
4. లక్షల మందికి నైపుణ్య శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షణ కోసం ప్రధానమంత్రి ప్యాకేజీ కింద నాలుగో పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఐదేళ్ల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణనిస్తామన్నారు. 1,000 ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద ఉన్నతీకరిస్తామని వెల్లడించారు.
5. స్కిల్ లోన్స్
మోడల్ స్కిల్ లోన్ కింద రూ.7.5 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వ ప్రయోజిత ఫండ్ ద్వారా పూచీకత్తు ఇస్తామని కేంద్రం తెలిపింది. దీని వల్ల ఏటా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేసింది.
6. విద్యా రుణాలు
దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలను (రూ.10 లక్షల వరకు) తీసుకునే విద్యార్థులకు కేంద్రం ఆర్థిక సాయం అందజేయనుంది. దీని కింద ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే ఈ-ఓచర్లు అందజేస్తుంది.
7. కస్టమ్స్ సుంకం తగ్గింపు
కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి, ప్లాటినమ్ లాంటి లోహాలతో సహా, క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే టెలికాం పరికరాల ధరలు మాత్రం పెరగనున్నాయి.