BSNL New Number Online : బీఎస్‌ఎన్‌ఎల్‌కు మళ్లీ మంచి రోజులొచ్చాయి!. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లతో పోలిస్తే రీఛార్జ్ ప్లాన్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిపోతున్నారు. ఈక్రమంలో తమ నెట్‌వర్క్‌కు మారే వారికి నచ్చిన నంబరును ఆన్‌లైన్‌లోనే ఎంపిక చేసుకునే సదుపాయాన్ని బీఎస్ఎన్‌ఎల్ కల్పిస్తోంది. ఇంతకీ నచ్చిన నంబరును ఎలా ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ నాలుగు ఆప్షన్లతో సెర్చ్ చేయండి
బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు మారిపోతున్న వాళ్లు తమకు నచ్చిన నంబరును ఈజీగా ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకోసం తొలుత మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ లేదా ఏదైనా ఇతర సెర్చింజన్‌ను ఓపెన్ చేయండి. అందులోకి వెళ్లాక "BSNL Choose Your Mobile Number" అని సెర్చ్ చేయండి. ఆ వెంటనే మీ ఎదుట కొన్ని వెబ్‌పేజీ లింకులు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో "cymn"పై క్లిక్ చేయాలి. ఆ పేజీ తెరుచుకున్నాక మీ జోన్, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన ఫోన్ నంబరును వెతుక్కునేందుకు search with series, start number, end number, sum of numbers అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మనకు ఏది అవసరమని భావిస్తే దాన్ని ఎంపిక చేయాలి. ఏదైనా ప్రత్యేకమైన నంబర్ సిరీస్ కావాలంటే search with series ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఫోన్ నంబరులోని తొలి అంకె నిర్దిష్టంగా ఏదైనా కావాలంటే సెర్చ్ చేసేందుకు start number ఆప్షన్‌ను వాడాలి. ఫోన్ నంబరులోని చివరి అంకె నిర్దిష్టంగా ఏదైనా కావాలంటే సెర్చ్ చేసేందుకు end number ఆప్షన్ పనికొస్తుంది. అన్ని అంకెల టోటల్ విలువ ఎంత ఉండాలనే దాని ఆధారంగా ఫోన్ నంబరును సెర్చ్ చేసేందుకు sum of numbers ఆప్షన్‌ను వాడాలి.