Best Selling Cars In April 2024 : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 2024 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే శుభారంభం అందుకుంది. ఈ ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లలో 7 మోడళ్లు మారుతి సుజుకి కంపెనీవే కావడం విశేషం. మిగతా వాటిలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలకు చెందిన బెస్ట్ కార్లు ఉన్నాయి.
2024 ఏప్రిల్‌లో అమ్ముడైన టాప్-10 కార్లలో SUV మోడళ్లు అత్యధికంగా ఉన్నాయి. టాటా పంచ్, మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి ఎకో అత్యధికంగా అమ్ముడయ్యాయి. టాటా పంచ్ ఏప్రిల్‌లోనే 19,158 యూనిట్ల అమ్ముడై, వరుసగా రెండోసారి బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీని తర్వాత మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 17,850 యూనిట్లు, మారుతి సుజుకి బ్రెజ్జా 17,113 యూనిట్ల విక్రయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
కొంతకాలంగా సెడాన్ సెగ్మెంట్ అమ్మకాలు క్షీణిస్తున్నప్పటికీ, మారుతి సుజుకి డిజైర్ మాత్రం చాలా సంవత్సరాలుగా బలమైన మూలస్థంభంగా నిలిచింది. ఏప్రిల్‌లో మారుతి డిజైర్ 15,825 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. హ్యుందాయ్ క్రెటా 15,447 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ కలిసి 14,807 యూనిట్లు విక్రయాలు జరిగాయి. వీటి తర్వాతి నాలుగు టాప్ కార్లన్నీ మారుతివే కావడం గమనార్హం. మారుతి ఫ్రాంక్స్ 14,286 యూనిట్లు, మారుతి బాలెనో 14,049 యూనిట్లు అమ్ముడవగా, ఎర్టిగా ఎమ్‌పీవీ 13,544 యూనిట్లు, వ్యాన్ సెగ్మెంట్‌లోని మారుతి ఎకో 12,060 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. మొత్తంగా చూసుకుంటే, ఈ 7 మారుతి కార్లు అన్నీ కలిపి ఏకంగా 1,04,727 యూనిట్స్ సేల్ అయ్యాయి.