BEGAM BAZAR :హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములకు అత్యధిక ధరలు ఉన్న మాట వాస్తవమే. కానీ, అంతకు మించిన ధరలు ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని బేగంబజార్‌లో పలుకుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మాదిరిగా ఇక్కడ భూములకు ధరలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని బేగంబజార్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోల్‌సేల్ వ్యాపార హబ్‌గా పేరుగాంచింది. ఇక్కడ స్థలం ధరలు ఆకాశమే హద్దుగా చుక్కలనంటుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో అందరినీ ఔరా అనిపిస్తున్నాయి. బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్లకు నెలవు. ఇక్కడ గల్లీ, వీధిని బట్టి గజానికి కనీస ధర రూ.10 లక్షలకు తక్కువ కాకుండా పలుకుతోంది. ప్రైమ్ ఏరియాల్లో గజానికి రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైమాటే. అత్యంత గరిష్ఠ ధరలు కొనుగోలుదారులకు కొత్తేమీ కాకున్నా చాలా మందికి వింతగా కనిపించడం, వినిపించడం ఆశ్చర్యకర పరిణామం. ఇక్కడ కొత్తగా స్థలాల లభ్యత లేదు. పాతవి, పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు రూ.కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్!
భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే చేతులు మారుతూ నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. ఆ పాత భవనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు. పాత భవనం అమ్మకానికి ఉందన్న విషయం తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని క్షణాల్లో అక్కడ వాలిపోతారు. అందరి కంటే ఎక్కువగా ఇస్తామంటూ పోటీ పడుతుంటారు. ఒకరికి మించి ఇంకొకరు రేటు పెంచుకుంటూ పోతుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య పోటీ వేలం పాటను తలపిస్తుందంటే నమ్మశక్యం కాదు. భూమి యజమానికి కాసుల పంట కురిపించేలా పోటీ ఉంటుంది. పలు సందర్భాల్లో కొనుగోలుదారుల ఒత్తిడుల వల్ల అమ్మకందారుడు ‘టాస్’ వేసి మరీ ఆ స్థలాన్ని అమ్ముతుండడం విశేషం.
రాష్ట్ర విభజనతో అమాంతం పెరిగిన ధర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరంగా ఉన్న బేగం బజార్ భూముల ధరలకు 2014 తర్వాత రెక్కలొచ్చాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే. విభజనాంతరం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెరిగిపోయింది. ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోల్‌సేల్ మార్కెట్లకు బేగంబజార్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులు ఎంతోమంది తమ వారిని రప్పించుకొని ఇక్కడే స్థిరపడ్డారు. రోజువారీ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు.