Real Estate Consultancies : అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు, పలువురు ఉద్యోగులు, వ్యాపారులు గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలు, పెట్టుబడి, హోదా దృష్ట్యా ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్‌లు, విల్లాలకు యజమానులు అవుతున్నారు. పెట్టుబడికి తగినట్లుగా ఆదాయం కూడా వస్తుండడంతో భూముల కొనుగోలు కంటే ఫ్లాట్‌ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు.
ఎక్కడో ఉంటూ ఆ ఇళ్లు, ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడం కష్టమే. ఒక వేళ ఖాళీగా ఉన్నా నిర్వహణ వ్యయాన్ని భరించక తప్పదు. ఈ నేపథ్యంలో స్థిరాస్తి కన్సల్టెన్సీలు రంగంలోకి దిగుతున్నాయి. యజమానులకు, అద్దెదారుల మధ్య వారధిగా సేవలు అందిస్తున్నాయి. పలు ఆన్‌లైన్ పోర్టల్స్ లోనూ ఉచితంగా ఇలాంటి సేవలు అందిస్తున్నారు. వెలుసుబాటును బట్టి ఆయా ఇళ్ల యజమానులు ఈ తరహా సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో వందల కొద్దీ గేటెడ్ కమ్యూనిటీలు ఉండగా అందులో రెండు, మూడు, నాలుగు పడకగదుల ఇళ్లే అధికం. ఆ కమ్యూనిటీల్లో 25 నుంచి 40 శాతం ఫ్లాట్లు అద్దెకు ఇస్తున్నవే. ఫ్లాట్ల యజమానులు ఉంటున్నవి 60 నుంచి 80శాతం వరకు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటికి డిమాండ్ ఉంది.
గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం, మాదాపూర్, గౌలిదొడ్డి ప్రాంతాల్లోని విలాసవంతమైన ఫ్లాట్ల అద్దె దాదాపు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షల దాకా ఉంటోంది. ఈ స్థాయిలో అద్దెలు చెల్లించేవారు ఎలాంటి వారో! వారి నేపథ్యం ఏమిటో విదేశాల్లో ఉన్న యజమానులకు తెలుసుకోవడం కష్టమే. ఫ్లాట్ అద్దె వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచినా మోసాలకు పాల్పడే అవకాశాల్లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయులంతా కన్సల్టెన్సీల సేవలను ఆశ్రయిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సగటు అద్దె రూ.15 వేల నుంచి మొదలవుతుండగా ప్రాంతాన్ని బట్టి అద్దెల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి.
ఇళ్లు అద్దెకు ఇచ్చే స్థిరాస్తి కన్సల్టెన్సీలు గేటెడ్ కమ్యూనిటీల పరిధిలోనే తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అద్దె ఫ్లాట్ల వివరాలను యజమానుల నుంచి సేకరించి తాళాలు తమ వద్దనే ఉంచుకొని అద్దె కోసం వచ్చే వారికి ఫ్లాట్‌లను చూపిస్తుంటాయి. రెంటల్ డీడ్, గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలకు సంబంధించిన పత్రాలను తయారు చేసి అద్దె ఒప్పందం చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో ఇటు అద్దెదారులతో పాటు యజమానుల నుంచి మొదటి నెల అద్దెలో 50 శాతం కమిషన్ తీసుకుంటున్నాయి. అద్దెకు వచ్చే వారి పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతనే సంబంధిత సమాచారాన్ని యజమానికి పంపి వారి ఆమోదంతోనే ఒప్పందం చేసుకుంటారు. ఫ్లాట్ ఖాళీ అయిన తర్వాత తిరిగి రంగులు వేయించడం, స్వల్ప మరమ్మతులు చేయించడం వంటి పనులు కూడా కన్సల్టన్సీలు బాధ్యతగా తీసుకుంటున్నాయి.
కిరాయిదారులకూ అన్ని వసతులు
గేటెడ్ కమ్యూనిటీలో అద్దెకు ఉండే వారికి కూడా స్థానికంగా వసతులన్నీ పొందే అవకాశాలున్నాయి. జిమ్, క్లబ్‌హౌస్, పార్కులు, ఈత కొలను, పిల్లల ఆట కేంద్రాలు వంటి సౌకర్యాలన్నిటినీ వారు కూడా వాడుకునే వీలుంది. యజమానికి అద్దెతోపాటు సొసైటీలకు నిర్వహణ ఖర్చులనూ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో సమావేశ మందిరాలు, మినీ సినిమా థియేటర్లు కూడా నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చు.
అక్రమాలపై యజమానులకు తాఖీదులు
అధిక మొత్తాల్లో అద్దె ఆశించి ఎవరైనా యజమానులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఫ్లాట్ కిరాయికి ఇస్తే సొసైటీ చర్యలు తీసుకుంటుంది. ఫ్లాట్‌కు కొత్తవారు అధికంగా రావడం, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పసిగడితే ఖాళీ చేయించాలని తాఖీదులు జారీ చేస్తుంది. యజమానికి రూ.లక్ష వరకు జరిమానా విధించడంతో పాటు చివరకు ఆ ఫ్లాట్లకు తాగునీరు, విద్యుత్తు వంటి వసతులను నిలిపి వేసేలా సొసైటీలు చర్యలు తీసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ - జూబ్లీహిల్స్, గచ్చిబౌలి కాదు - High land cost in Hyderabad