Salary Hike In 2025 :ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది మన దేశంలోని వివిధ రంగాల వేతన జీవులకు సగటున 9.4 శాతం మేర వేతనాలు పెరిగే అవకాశం ఉంది. హెచ్‌ఆర్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెర్సర్’ నిర్వహించిన టోటల్ రెమ్యునరేషన్ సర్వే (టీఆర్ఎస్)లో ఈ అంశాన్ని గుర్తించారు. గత ఐదేళ్లుగా భారతదేశంలో ఉద్యోగుల వేతనాలు క్రమంగా పెరుగుతున్నాయని వెల్లడైంది. ఈ క్రమంలోనే 2020 సంవత్సరంలో 8 శాతం మేర వేతనాలు పెరిగాయని గుర్తు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఉన్న డిమాండ్ కారణంగా వేతనాల పెంపునకు కంపెనీలు సిద్ధపడుతున్నాయని సర్వే నివేదికలో ప్రస్తావించారు. ఈ సర్వేలో భారత్‌లోని 1,550కిపైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఇవన్నీ విభిన్న రంగాలకు చెందినవి. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్జ్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ రంగం, వాహన రంగం, ఇంజినీరింగ్ రంగాల కంపెనీలను సర్వే చేశారు.
వాహన రంగం టాప్
ఈ ఏడాది వేతనాల పెంపులో వాహన రంగం ముందంజలో ఉంటుందని ‘మెర్సర్’ సంస్థ సర్వే నివేదిక తెలిపింది. ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపు 8.8 శాతం నుంచి 10 శాతం దాకా ఉండొచ్చని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ మిషన్ అనేవి వాహన రంగానికి ఊతమిస్తున్నాయని నివేదిక తెలిపింది.
రెండో స్థానంలో మాన్యుఫాక్చురింగ్ -ఇంజినీరింగ్ రంగం
వేతనాల పెంపులో రెండో స్థానంలో తయారీ-ఇంజినీరింగ్ రంగం ఉంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది 8 శాతం నుంచి 9.7 శాతం మేర వేతనాలు పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. తయారీ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇందుకు ఊతం ఇవ్వనున్నాయి.