Investment In Small Cap Funds : ఈ మధ్యకాలంలో మూచువల్ ఫండ్స్‌లోకి ప్రజల పెట్టుబడులు పెరిగాయి. మూచువల్ ఫండ్స్ చాలా రకాలు. వీటిలో స్మాల్ క్యాప్ రకం మూచువల్ ఫండ్స్ మదుపరుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. దీర్ఘకాలంలో ఇవి లాభదాయకంగానే ఉంటాయి. అయితే స్వల్పకాలికంగా వీటిలో భారీ హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. అందుకే స్మాల్ క్యాప్ మూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే విషయంలో మదుపరులు సంశయిస్తుంటారు. ఇలాంటి వారు తప్పకుండా 'స్ట్రెస్ టెస్ట్' నివేదికలను అధ్యయనం చేయాలి. ఇంతకీ అదేమిటి ? దానితో స్మాల్ క్యాప్ ఫండ్స్ తాజా స్థితిగతులను ఎలా తెలుసుకోవచ్చు ? వివరాలివీ.
ఏమిటీ 'స్ట్రెస్ టెస్ట్' ?
ప్రతీ మూచువల్ ఫండ్ నెలకోసారి 'స్ట్రెస్ టెస్ట్' నివేదికను విడుదల చేస్తుంటుంది. సదరు ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న 25 శాతం భాగాన్ని, 50 శాతం భాగాన్ని నగదుగా మార్చుకునేందుకు(లిక్విడిటీకి) ఎన్ని రోజుల సమయం పడుతుందనే వివరాలు దానిలో ఉంటాయి. స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పుడు, ఫండ్‌కు సంబంధించిన ఆస్తుల విలువలు తగ్గిపోయినప్పుడు, వడ్డీరేట్లు మారినప్పుడు, ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు మూచువల్ ఫండ్‌ల స్థాయులు ఎలా ఉంటాయనేది ఈ నివేదిక చెబుతుంది. ఒక్కసారిగా భారీసంఖ్యలో ఇన్వెస్టర్లు డబ్బును విత్‌డ్రా చేసుకుంటున్న సమయంలో సదరు మూచువల్ ఫండ్‌కు చెందిన ఫండ్ మేనేజర్లు ఎంత త్వరగా స్టాక్స్ (షేర్లు)ను విక్రయిస్తారనే అంచనాలను కూడా ఈ నివేదిక తెలియజేస్తుంది. మూచువల్ ఫండ్‌కు చెందిన మేనేజర్లు ఒక్కసారిగా తమ వద్దనున్న షేర్లను విక్రయిస్తే, ఫండ్ విలువలో జరిగే మార్పులపైనా ఈ నివేదికలో అంచనాలు ఉంటాయి.
ఏమిటీ స్మాల్ క్యాప్ మూచువల్ ఫండ్ ?
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకారం, స్మాల్ క్యాప్ మూచువల్ ఫండ్స్ తమ వద్ద ఉండే నిధుల్లో 65 శాతాన్ని స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడిగా పెడతాయి. దీనివల్ల వీటిలో లిక్విడిటీ ప్రక్రియ అనేది వెంటనే జరిగేందుకు, భారీగా జరిగేందుకు అవకాశం ఉండదు. ఇందుకు భిన్నంగా లార్జ్ క్యాప్ షేర్లలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. స్మాల్ క్యాప్ మూచువల్ ఫండ్స్ విలువ భారీ హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. అందుకే ఇవి రిస్కీ. గత కొన్నేళ్లుగా స్మాల్ క్యాప్ మూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా వాటి విలువలు అమాంతం పెరిగిపోయాయి. అయినా మీరు ఏదైనా స్మాల్ క్యాప్ మూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని భావిస్తే, దానికి సంబంధించిన తాజా టస్ట్రెస్ టెస్ట్' నివేదికను తప్పకుండా చూడండి.