Hindenburg Closed :అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఆ మధ్య భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ గురువారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతానని అన్నారు. తన బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతానని అన్నారు.
"ఈ విషయం గురించి గతేడాది చివరి నుంచి నా కుటుంబం, స్నేహితులు, మా బృందంతో చర్చించాను. అనంతరం హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా. దీనిపై మేం ఎంచుకున్న ప్రణాళికలు , ఐడియాలు ముగియడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వెనక ఎలాంటి బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు లేవు. విజయవంతమైన కెరీర్ ఏదో ఒకరోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు నాకు చెప్పారు. గతంలో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకునేవాడిని. ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్‌లో ఉన్నానని అనిపిస్తోంది. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. కానీ, జీవితానికి సరిపడా చేసిన సాహసం. ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశాం. ఇదంతా నాకో ప్రేమకథలా అనిపిస్తోంది"
-- లేఖలో అండర్సన్
ఏమిటీ హెండెన్‌బర్గ్ రీసెర్చ్?
న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఈ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research)ను నాథన్ అండర్సన్ 2017లో స్థాపించారు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తన వెబ్‌సైట్‌లో ఈ కంపెనీ వెల్లడించింది.పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది. ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది.