Anant Ambani Radhika Sangeet: దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ సంగీత్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంబానీ కుటుంబం డ్యాన్స్
ఆ ప్రత్యేక వీడియోలో ముకేశ్, ఆయన సతీమణి నీతా అంబానీ కలిసి తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి కారు షికారు చేస్తూ కన్పించారు. వింటేజ్ ఓపెన్ టాప్ కారులో ముకేశ్ అంబానీ డ్రైవింగ్ చేస్తున్నారు. నీతా అంబానీ మనవళ్లు పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద పక్కన కూర్చున్నారు. అలనాటి బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ నటించిన 'బ్రహ్మచారి' చిత్రంలోని 'చక్కే మే చక్కా' పాటను పాడుతూ వారు షికారు చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను సంగీత్‌లో ప్రదర్శించారు. ఇక ఈ సంగీత్ వేడుకల్లో అంబానీ కుటుంబమంతా కలిసి డాన్స్‌లు చేశారు. అదే ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమా 'ఓం శాంతి ఓం'లోని 'దీవాంగీ దీవాంగీ' పాటకు ముకేశ్-నీతా, ఆకాశ్-శ్లోకా, ఈశా-ఆనంద్ పిరమాల్, అనంత్-రాధిక ఆడిపాడారు. నీతా అంబానీ సంప్రదాయ భరతనాట్యం స్టెప్పులతో ఆకట్టుకున్నారు.