Anant Ambani Radhika Wedding: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబయిలోని అంబానీ నివాసంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం జులై 3న(బుధవారం) 'మామెరు' వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. వరుడు అనంత్ అంబానీ, వధువు రాధికా మర్చంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెళ్లికి కొద్దిరోజుల ముందు మామెరు వేడుక నిర్వహిస్తారు.
వధూవరులను ఆశీర్వరించిన కుటుంబ సభ్యులు
అనంత్ అంబానీ తల్లి అయిన నీతా అంబానీ పుట్టింటి వారు 'మామెరు' వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ వరుడి ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధికా మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు.
పూలతో ఇల్లు అలంకరణ
అనంత్, రాధిక 'మామెరు' వేడుక కోసం అంబానీ నివాస భవనం యాంటిలియాను అందంగా తీర్చిదిద్దారు. ఎరుపు, గులాబీ, నారింజ పూలతో అలంకరించారు. దీని అందాన్ని మరింత పెంచేందుకు బంగారు దీపాలు కూడా ఏర్పాటు చేశారు. అనంత్, రాధిక క్యారికేచర్లతో కూడిన డిజిటల్ స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందులో 'ఆల్ ది బెస్ట్' అని రాసి ఉంది. ఈ వేడుకలో అంబానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అనంత్- రాధిక పెళ్లి ఫుల్ షెడ్యూల్ ఇదే
- జులై 12 నుంచి మూడు రోజుల పాటు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగనున్నాయి.
- జులై 12న ముఖ్య ఘట్టమైన శుభ్ వివాహ్‌తో పెళ్లి వేడుకలు మొదలుకానున్నాయి. ఈ వేడుకకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి హాజరుకానున్నారు.
- జులై 13న శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు కూడా అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులతో రానున్నారు.
- జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకలకు అతిథులు ఇండియన్ చిక్ డ్రెస్ కోడ్‌తో హాజరవ్వనున్నారు.