Anant Ambani Pre Wedding Invitation Card :ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకకు అదిరిపోయే ఇన్విటేషన్ సిద్ధం చేశారు. పెళ్లికి ముందు మూడు రోజుల పాటు జరిగే ఈవెంట్‌కు, ప్రపంచ ప్రఖ్యాత అతిథులను ఆహ్వానిస్తున్నారు. వీరిని ఆహ్వానించేందుకు రూపొందించిన వీడియోలో, 8 పేజీల ఇన్విటేషన్ కార్డు ఉంది. అందులో వేడుక జరిగే స్థలం, సమయం, వివిధ ఈవెంట్లకు పెట్టిన డ్రెస్కోడ్లు వంటి వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఆహ్వాన పత్రికలో ఇంకా ఏఏ విశేషాలు ఉన్నాయో చూద్దాం పదండి.
అక్షరాలతో మొదలు
ఆహ్వాన పత్రిక మొదటి పేజీలో అనంత్, రాధిక పేర్ల నుంచి మొదటి అక్షరాన్ని హిందీలో రాశారు. దాన్ని ఒక లోగో ఆకారంలో తీర్చిదిద్ది చుట్టూరా ఎర్రగులాబీలు డిసైన్ వేశారు. ఆ తర్వాతి పేజీలో అంబానీలు ఒక సందేశాన్ని రాశారు. అయితే ఈ పేజీని అనంత్ అభిరుచికి అనుగుణంగా దీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అనంత్‌కు ప్రకృతి, జంతువులు అంటే ఇష్టం. దీంతో ఈ పేజీలో ప్రకృతితో మమేకమైన పక్షులు, జంతువుల డిజైన్ వేశారు.
స్పెషల్ సర్ప్రైజ్
మార్చి 1న కాక్టెయిల్ పార్టీతో ప్రీవెడ్డింగ్ వేడుక ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.30 మొదలయ్యే ఈ పార్టీకి 'ఎలిగంట్ కాక్టెయిల్' డ్రెస్‌కోడ్‌ను సూచించారు. అయితే అతిరథమహారథులకు మొదటి రోజు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఇన్విటేషన్ కార్డులో చెప్పారు. అదేంటో తెలియాలంటే మార్చి 1 వరకు ఆగాల్సిందే.
వైల్డ్‌సైడ్ వాక్
మార్చి 2న రెండు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ఉదయాన అంబానీ కుటుంబం 3000 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జంతు సంరక్షణ కేంద్రం 'వన్‌తారా'లో వైల్డ్‌సైడ్ వాక్ అనే కార్యక్రమం చేపడతారు. దీనికోసం 'జంగల్ ఫీవర్' డ్రెస్సులను ధరించాల్సిందిగా అతిథులకు సూచించారు. ఇక సాయంత్రం జరిగే కార్నివాల్లో డ్యాన్సింగ్ షూలు వేసుకోవాల్సిందిగా చెప్పారు.
ప్రకృతి ఒడిలో అతిథులకు విందు
చివరగా మార్చి 3న ప్రపంచ నలుమూలల నుంచి హాజరైన అతిథులకు ప్రకృతి మధ్యలో మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు అంబానీలు. ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో అతిథులను భారత సంప్రదాయ దుస్తులను ధరించమని కోరారు. ఇక ఇన్విటేషన్ చివరి పేజీలో వధూవరుల తల్లిదండ్రుల పేర్లతో సహా అంబానీ, మర్చంట్ కుటుంబాలకు చెందిన వారి పేర్లను రాశారు.