Agriculture Incentives In 2024 Budget : 'లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ సర్కార్ గ్రామీణ ఓటర్లను, ముఖ్యంగా రైతులను ఆకర్షించేందుకు మధ్యంతర బడ్జెట్లో పలు వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయ రుణాల పరిమితి పెంచే అవకాశం కనిపిస్తోంది. అత్యాధునిక సాంకేతికతను, స్థిరవ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించవచ్చు. అలాగే కృత్రిమమేధ (AI) అధారిత ఆగ్రిటెక్ ఉత్పత్తులు, స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సూచనలు ఉన్నాయి' అని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.
వ్యవసాయ రుణాలు
మోదీ సర్కార్ 2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 'పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి'ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వచ్చింది.
ఇప్పుడు 2024 ఎన్నికలు దగ్గరపడ్డాయి. అందుకే రైతులకు ఇచ్చే రుణాలను మరింత పెంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. 2023 డిసెంబర్ నాటికి మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల మేర రైతు రుణాలను అందించింది. దీనిని రూ.22-25 లక్షల కోట్లకు పెంచాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇదే జరిగితే అర్హులైన రైతులకు సంస్థాగత రుణాలు మరింత అందుబాటులోకి వస్తాయి.
పన్ను ప్రోత్సాహకాలు
'కేంద్ర ప్రభుత్వం అగ్రిటెక్ స్టార్టప్లకు కనీసం 10-15 సంవత్సరాల పాటు ప్రత్యేక పన్ను రాయితీలు కల్పించాలి. లేదా పన్ను సెలవులు (టాక్స్ హాలీడే) ప్రకటించాలి. దీని వల్ల వ్యవసాయ-సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వీలవుతుంది. ఫలితంగా అగ్రి-టెక్ పరిశ్రమ కూడా మంచి పురోగతి సాధిస్తుంది' అని స్టారాగ్రి సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్ అమిత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
మౌలిక సదుపాయాల కల్పన
'పట్టణాల మాదిరిగానే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధునాత మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులు కేటాయించాలి. ముఖ్యంగా ధాన్యాలను, వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు ఆధునిక గిడ్డంగులను నిర్మించాలి. వీటి అద్దెలు కూడా వీలైనంత తక్కువగా ఉండేలా చూడాలి. ఇందుకోసం ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించేవారికి పన్ను మినహాయింపులు, ఆకర్షిణీయమైన తరుగుదల రేట్లు అందివ్వాలి' అని అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు.