Aadhaar ATM : మీకు అర్జెంట్‌గా డబ్బులు కావాలా? బ్యాంక్‌కు వెళ్లి నగదు తీసుకునేంత సమయం లేదా? దగ్గర్లో ఏటీఎంలో డబ్బులు కూడా రావట్లేదా? అయితే ఇది మీ కోసమే. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్తగా ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం సర్వీసులు తీసుకొచ్చింది. దీంతో ఇంటి దగ్గరే మీరు నగదు పొందొచ్చు. మరెందుకు ఆలస్యం ఇంటి దగ్గరే నగదు తీసుకునే ఈ కొత్త సర్వీసు గురించి తెలుసుకుందాం.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆధార్ ఏటీఎం గురించి ఓ ట్వీట్ చేసింది.
"ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB) అందిస్తున్న ఆధార్ ఏటీఎం(ఏఈపీఎస్) ద్వారా మీ ఇంటి వద్ద నుంచే డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్స్ కూడా చూసుకోవచ్చు. దీని కోసం మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయ్యుంటే చాలు.
- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ట్వీట్
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) అంటే?
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్‌తో క్యాష్ విత్‌డ్రా సహా, ఇతర లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా మీ బ్యాంకు ఖాతా అధార్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. ఆధార్‌తో అనుసంధానం అయిన ఏ బ్యాంకు ఖాతాను అయినా బయోమెట్రిక్ ఇచ్చి ఉపయోగించుకోవచ్చు. క్యాష్ విత్‌డ్రాతో పాటు ఇతరులకు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారికి గరిష్టంగా రూ.10 వేలు వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంక్‌కు లేదా ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిజినెస్ కరస్పాండెంట్ మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సేవలు అందిస్తారు.