Savings Accounts :సాధారణంగా ఆర్థిక ప్రయాణం మొదలయ్యేది సేవింగ్స్ అకౌంట్‌తోనే. ప్రతి వ్యక్తికీ ఇదొక ప్రాథమిక ఆర్థిక అవసరంగా పరిగణించాలి. అందుబాటులో అనేక బ్యాంకులున్నప్పటికీ, ఒకటి రెండు బ్యాంకులతోనే మన పొదుపు ఖాతా బంధం కొనసాగుతుంది. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ ఖాతా నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే?
పొదుపు ఖాతాలు ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు, అత్యవసర నిధిని దాచుకునేందుకూ బాగా ఉపయోగపడతాయి. జీతం నుంచి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే మొత్తం వరకూ అన్నీ ఇందులోకే వస్తుంటాయి. పొదుపు ఖాతాను ఓపెన్ చేయడంతోనే పని అయినట్లు కాదు. దాన్ని నిర్వహించడంలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లోన్ తీసుకోవాలన్నా మీ పొదుపు ఖాతానే బ్యాంకులు ముందుగా పరిశీలిస్తాయి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.
మరో అకౌంట్ ఓపెన్ చేయండి
జీతం లేదా ప్రాథమిక పొదుపు ఖాతా నుంచే ప్రతి చిన్న ఖర్చూ చేయవద్దు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్‌ను ఓపెన్ చేసి, నెలకు ఒకసారి దానిలో నిర్ణీత మొత్తం డిపాజిట్ అయ్యేలా చూసుకోండి. డిజిటల్ చెల్లింపు యాప్‌లను ఉపయోగించేందుకు ఈ ఖాతానే లింక్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల మీ ఖర్చులు ఎంత అవుతున్నాయనేదీ కచ్చితంగా తెలుసుకునేందుకు వీలు పడుతుంది.
సరైన బ్యాంకును ఎంచుకోండి
పొదుపు ఖాతాను ఓపెన్ చేసేందుకు ముందు సరైన బ్యాంకును ఎంచుకోండి. వివిధ బ్యాంకులు అందిస్తున్న ప్రయోజనాలపై కొంచెం తెలుసుకోండి. వడ్డీ రేట్లు, ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీలు ఇలా అన్నింటి వివరాలూ సరి చూసుకోవడం ముఖ్యం. ఇప్పుడు కొత్త తరం బ్యాంకులు రూ.రెండు లక్షలకు మంచి నిల్వ ఉన్న సేవింగ్స్ అకౌంట్ పై దాదాపు 7శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి. ఒకవేళ సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే దానిపై విధించే పెనాల్టీలనూ చెక్ చేసుకోవాలి.
పెట్టుబడులకు వేరొక అకౌంట్
పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేయండి. ఇందులో నుంచే మీ మొత్తం పెట్టుబడులకు వెళ్లేలా చేయండి. దీని వల్ల మీరు మదుపు చేస్తున్న మొత్తం ఎంత, దానిపై వస్తున్న డివిడెండ్లు, ఇతర ప్రయోజనాలను సులభంగా నిర్వహించేందుకు వీలుపడుతుంది.