తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ కార్డ్​తో ఈ ట్రాన్సాక్షన్స్​ చేస్తే IT నోటీసులు గ్యారెంటీ! - CREDIT CARD INCOME TAX RULES

క్రెడిట్ కార్డ్​లతో ఈ లావాదేవీలు అస్సలు చేయకూడదు - చేశారో ఐటీ నోటీసులు రావడం పక్కా!

Credit Card
Credit Card (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 4:10 PM IST

Credit Card Income Tax Rules : మన క్రెడిట్ కార్డు లావాదేవీలు, మన వ్యాపార లావాదేవీలు, నగదు డిపాజిట్లను ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తుంటుంది. మరీ ముఖ్యంగా అత్యధిక విలువ కలిగిన లావాదేవీల విషయంలో ఇది కచ్చితంగా జరుగుతుంది. కనుక క్రెడిట్ కార్డు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆదాయ పన్ను శాఖ వారు మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ఐటీ నోటీసులు రావడానికి కారణమయ్యే 7 రకాల లావాదేవీల గురించి తెలుసుకుందాం.

విదేశీ ప్రయాణ ఖర్చులు
కొంత మంది విదేశాల్లో ప్రయాణించేటప్పుడు విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. కానీ వీలైనంత వరకు ఇలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షలకు మించి ఖర్చు చేస్తే, అది ఆటోమేటిక్​గా ఆదాయ పన్ను శాఖ వారికి తెలుస్తుంది. అప్పుడు మీకు ఐటీ నోటీస్​ వచ్చే ప్రమాదం ఉంటుంది.

పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం
కొంత మంది క్రెడిట్ కార్డులు ఉపయోగించి పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రెడిట్​ కార్డు ఖర్చులు వార్షికంగా రూ.2 లక్షలకు మించి ఉంటే, ఐటీ శాఖ మీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. మీ ఆర్థిక లావాదేవీలను ప్రత్యేకంగా ట్రాక్ చేస్తుంది.

రూ.1 లక్షకు మించి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం
యూజర్లు ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు కడుతూ ఉంటే, అటువంటి వారి లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ కచ్చితంగా సమీక్షిస్తుంది.

వాస్తవానికి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు మాత్రమే కాదు, మరికొన్ని రకాల ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు కూడా మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటంటే?

స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్​మెంట్స్​
ఒక సంవత్సరంలో స్టాక్స్​, మ్యూచువల్ ఫండ్స్​, బాండ్స్​లో రూ.10 లక్షలకు మించి పెట్టుబడులు పెడితే, ఆదాయ పన్ను శాఖ సదరు పెట్టుబడిదారుని ఆర్థిక లావాదేవీలను కచ్చితంగా పరిశీలిస్తుంది. సరైన డాక్యుమెంట్లు ఉంటే ఫర్వాలేదు. లేదంటే కచ్చితంగా ఇన్​కమ్​ ట్యాక్స్ నోటీసులు పంపిస్తుంది.

అత్యంత విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం
భారతదేశంలో రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు, ఆటోమేటిక్​గా ఆ రిపోర్ట్​లు ఆదాయ పన్ను శాఖకు అందుతాయి. కనుక ఎక్కువ మొత్తంలో రియల్​ ఎస్టేట్​లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కచ్చితంగా సరైన పత్రాలు ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.

పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయడం
బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు జమ చేస్తే, ఆ విషయం ఆటోమేటిక్​గా ఆదాయ పన్ను శాఖ వారికి తెలిసిపోతుంది. మీకు చట్టబద్ధంగా ఆదాయం వస్తే సరే. లేదంటే ఐటీ శాఖ కచ్చితంగా నోటీసులు జారీ చేస్తుంది.

నగదు రూపంలో భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు జరపడం
రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు చేసినప్పుడు వాటిని ఐటీ శాఖ ట్రాక్ చేస్తుంది. మీకు సదరు డబ్బు ఏ విధంగా వచ్చిందో ఆరా తీస్తుంది. మీరు చట్టబద్ధంగా డబ్బులు సంపాదించి ఉంటే ఓకే. లేదంటే మీకు ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అందుకే క్రెడిట్ కార్డులతో అతిగా లావాదేవీలు జరపకూడదు. అలాగే మీ ఆర్థిక స్థితికి మించి ఖర్చు చేయడం లేదా డిపాజిట్ చేయడం లాంటివి చేయకూడదు. మీ ఆదాయ వనరులకు సంబంధించిన పత్రాలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే స్పష్టమైన రికార్డులను ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీ ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అప్పుడే మీకు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాకుండా ఉంటాయి.

నోట్​ : ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

బిజినెస్‌ క్రెడిట్ కార్డ్‌ Vs పర్సనల్‌ క్రెడిట్‌ కార్డ్‌ - ఏది బెస్ట్ ఆప్షన్‌?

అదనపు క్రెడిట్​ కార్డ్​లను క్లోజ్ చేస్తే - లాభమా? నష్టమా?

ABOUT THE AUTHOR

...view details