Buying Car With Credit Card Factors :ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డుతో లావాదేవీలు జరిపినట్లయితే ఈఎంఐ ఆప్షన్స్, ఆఫర్స్, రివార్డు పాయింట్స్ లభిస్తుండడం వల్ల చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు. అందుకే కొందరు రివార్డు పాయింట్లు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో క్రెడిట్ కార్డుతో భారీ కొనుగోళ్లు కూడా జరుపుతారు. ఈ క్రమంలోనే కొందరు కార్లు కూడా క్రెడిట్ కార్డుతో కొనేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు తెలివైన నిర్ణయం? లాభమా? నష్టమా? అలాగే క్రెడిట్ కార్డుతో కారు కొనుగోలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డుపై కారును కొనుగోలు చేయవచ్చా?
క్రెడిట్ కార్డుతో మొత్తం కారును కొనుగోలు చేయాలనే ఆలోచన ఆకర్షణీయంగా అనిపించవచ్చు. ఇలా చేస్తే రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డుతో కారును కొనుగోలు చేయడం వాస్తవానికి అంత ఈజీ కాదు. ఎందుకంటే కార్ డీలర్ షిప్ లు బుకింగ్ మొత్తాన్ని చెల్లించడానికి మాత్రమే క్రెడిట్ కార్డులను అంగీకరిస్తాయి. కారు బుకింగ్ ధర దాని విలువలో 5-10శాతం వరకు ఉంటుంది.ఉదాహరణకు మీరు రూ.10 లక్షల విలువైన కారును కొనుగోలు చేస్తున్నారనుకుందాం. అందులో కారు బుకింగ్ మొత్తం రూ.50వేలు- లక్ష వరకు ఉండొచ్చు. స్కోడా వంటి ఇతర డీలర్ షిప్‌లు తరచుగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై రూ.లక్ష వరకు లావాదేవీలను అనుమతిస్తాయి. కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ప్రీమియం వాహనాలకు ఈ మొత్తం రూ.3-5 లక్షల వరకు ఉంటుంది.
ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు
కారు బుకింగ్ మినహా మిగిలిన బ్యాలెన్స్‌ను చెల్లించడానికి చాలా డీలర్ షిప్‌లు క్రెడిట్ కార్డులను అంగీకరించవు. ఎందుకంటే డీలర్ షిప్ వసూలు చేసిన మొత్తంపై దాదాపు 1.75శాతం ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము డీలర్ల మార్జిన్ ను తగ్గిస్తుంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ వంటి క్రెడిట్ కార్డులపై 2.5 శాతం ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. అందుకే కారు డీలర్లు బుకింగ్ మొత్తానికి మించి క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అంగీకరించడానికి వెనుకాడుతారు.
ఈ ఆప్షన్స్ తెలుసుకోండి
మీ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేయాలని నిర్ణయించుకుంటే ఈ ఆప్షన్స్ పాటించండి. క్రెడిట్ కార్డుతో కారు బుకింగ్ ప్రీమియంను ఎక్కువ మొత్తంలో చెల్లించేలా డీలర్‌తో చర్చించండి. అలాగే కొన్ని డీలర్ షిప్‌లు ట్రాన్సాక్షన్ ఫీజును కస్టమర్‌తో షేర్ చేసుకోవడానికి అంగీకరిస్తాయి. అలాంటి డీలర్లతో మాట్లాడండి.