12 Companies That Completely Reinvented Themselves :వ్యాపారం చేయడం అంటే మాటలు కాదు. పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉన్నా, ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి? మార్కెట్లో ఏ వస్తువులకు, సేవలకు డిమాండ్ ఉంది? తదితర అంశాలను ఎప్పటికప్పుడు బాగా అధ్యయనం చేస్తూ ఉండాలి. వాటికి అనుగుణంగా వ్యాపారంలో తగు మార్పులు, చేర్పులు చేసుకుంటూ వృద్ధి చెందాలి. కస్టమర్ల అవసరాలను ముందే గమనించి కాలానికి అనుగుణంగా వ్యాపార వ్యూహాలు అమలు చేయాలి. అప్పుడే వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఈ విధంగా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ, చాలా కంపెనీలు వ్యాపారంలో అదరగొడుతున్నాయి. వాటిలోని టాప్-12 సంస్థల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
12. LG
మొబైల్ ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే 'ఎల్జీ' బ్రాండ్ అందరికీ సుపరిచితమే. దక్షిణ కొరియాకు చెందిన 'కూ ఇన్ హ్వోయి' అనే ఆయన 1947లో 'లక్కీ కెమికల్' పేరుతో ఓ కెమికల్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఫేస్‌క్రీమ్‌లు ఉత్పత్తి చేసి విక్రయించేవారు. ఆ తర్వాత దీని పేరును 'గోల్డ్ స్టార్'గా మార్చారు. ఈ కంపెనీ కొరియాలోనే తొలిసారి దేశీయ రేడియోను తయారు చేసింది. గోల్డ్ స్టార్ బ్రాండ్ కొరియాలో మొదటి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కలర్ టీవీలను తయారుచేసింది. 1983లో ఈ కంపెనీ పేరును 'లక్కీ గోల్డ్ స్టార్ గ్రూప్'గా మార్చారు. ఈ పేరునే కాస్త కుదించి 1995 నుంచి అధికారికంగా 'LG'గా మార్చారు.
ఎల్జీ కంపెనీ అమెరికాకు చెందిన అదిపెద్ద గృహోపకరణాల కంపెనీ జెనిత్ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎల్జీ కింద 19 వేర్వేరు కంపెనీలు ఉన్నాయి. పైగా ఈ కంపెనీకి రెండు స్పోర్ట్స్ (బేస్ బాల్, బాస్కెట్ బాల్) టీమ్‌లు కూడా ఉన్నాయి. ఈ విధంగా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుని ఎల్జీ కంపెనీ ఎలక్ట్రానిక్ సెక్టార్‌తో సహా పలు రంగాల్లో రాణిస్తోంది.
11. Berkshire Hathaway
ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ 'బెర్క్‌షైర్ హాత్వే' కంపెనీని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో కొనుగోలు చేశారు. దీని వెనుక ఒక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. 1927లో హాత్వే మాన్యుఫ్యాక్చరింగ్ కో పేరిట కొంతమంది టెక్స్టైల్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1960వ దశకం ప్రారంభంలో అమెరికా వస్త్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, ఈ కంపెనీ కూడా నష్టాలపాలైంది. దీనితో వారెన్ బఫెట్ ఈ కంపెనీ షేర్లను చాలా తక్కువగా కొనుగోలు చేసి, వాటి నుంచి భారీ లాభం పొందారు. దీనితో సదరు కంపెనీ వారెన్ బఫెట్‌ను చీట్ చేయాలని చూసింది. దీనితో బఫెట్ భారీ సంఖ్యలో ఆ కంపెనీ షేర్లు కొనేసి, అసలు యజమానులను కంపెనీ నుంచి బయటకు పంపేశారు. 1985లో బఫెట్ టెక్స్టైల్ వ్యాపారాన్ని మూసివేసి, దానిని బిలయన్ల డాలర్ల విలువైన కార్పొరేట్ హోల్డింగ్ కంపెనీగా తీర్చిదిద్దారు.
10. Shell
ప్రపంచంలోనే అతి భారీ లాభాలు పొందుతున్న ఇంధన సంస్థల్లో 'షెల్' ఒకటి. ఈ సంస్థ యజమానులకు 1930వ దశకంలో లండన్‌లో పురాతన వస్తువులను విక్రయించే చిన్న దుకాణం ఉండేది. మార్కస్ శామ్యూల్ అనే వ్యక్తి అప్పట్లో వివిధ దేశాల నుంచి రకరకాల షెల్స్‌ను దిగుమతి చేసుకొని అమ్మేవారు. దీనికితోడు, వారి కుమారులు ఎగుమతుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. లండన్ నుంచి ఓడల్లో భారీ యంత్రాలు, పనిముట్లను ఎగుమతి చేస్తూ జపాన్, చైనా నుంచి బియ్యం, సిల్క్ తదితర వస్తువులను దిగుమతి చేసుకునేవారు. కాగా 19వ శతాబ్దం చివర్లో ఇంధన వినియోగం భారీగా పెరిగింది. దీంతో శామ్యూల్ అండ్ సన్స్ ఇంధన రంగంలోకి దిగారు. 1892లో ప్రపంచంలోనే తొలిసారి అతిపెద్ద ఇంధన ట్యాంకర్‌ను నిర్మించారు. యూరప్‌నకు ఇంధనం దిగుమతి చేసుకోవడం కోసం పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. అలా ఆ రంగంలో శామ్యూల్ కుటుంబం పట్టు సాధించింది. 1897లో వారి షిప్పింగ్ కంపెనీ పేరును 'షెల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడింగ్' కంపెనీగా మార్చారు. 20వ శతాబ్దం ప్రారంభంలో షెల్ కంపెనీ, రాయల్ డచ్ పెట్రోలియంలో విలీనమైంది. ఆ తర్వాత 2022లో కొత్త పేరు, లోగోతో 'షెల్' సంస్థగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 46 షెల్ స్టేషన్లు ఉన్నాయి.
9. Nokia
ఫిన్లాండ్కు చెందిన ఫ్రెడ్రిక్ ఇడెస్టామ్ అనే మైనింగ్ ఇంజినీర్ 1871లో నోకియా ప్రాంతంలోని నోకియన్ విర్టా నది ఒడ్డున తన వ్యాపారం కోసం ఓ పేపర్ మిల్లు స్థాపించారు. 1898లో తన కంపెనీకి 'నోకియా ఏబీ' అని పేరు పెట్టారు. అదే సమయంలో ఫిన్నిష్ రబ్బర్ వర్క్స్ అనే సంస్థ టైర్లు, రబ్బరు బూట్లు తయారు చేసేది. ఈ రెండు కంపెనీలు 1912లో ఫిన్నిష్ కేబుల్ వర్క్స్ అనే సంస్థతో కలవడం వల్ల నోకియా కార్పొరేషన్ ఏర్పడింది. నోకియా బ్రాండ్‌తో సరికొత్త డిజైన్లతో, రంగు రంగుల రబ్బర్ బూట్లు తయారు చేసేవాళ్లు. ఈ వ్యాపారంలో నోకియా బాగా రాణించింది.
ఆ తర్వాత 1963లో నోకియా కంపెనీ తొలిసారి ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టింది. మిలటరీ, ఎమెర్జెన్సీ సర్వీసుల కోసం రేడియో ఫోన్లను తయారుచేసింది. 1980ల్లో కమర్షియల్ రేడియో ఫోన్లు, కార్ ఫోన్లు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ రంగంలోనే భవిష్యత్తును వెతుక్కున్న నోకియా 1990ల్లో రబ్బర్, పేపర్ కంపెనీలను విక్రయించేసి, పూర్తిగా మొబైల్ ఫోన్ల తయారీపైనే దృష్టిపెట్టింది. 1998 నుంచి 2012 వరకు ప్రపంచంలో ఏ మొబైల్ కంపెనీ విక్రయించలేనన్ని మొబైల్ ఫోన్లను నోకియా విక్రయించిందంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే, 2014 తర్వాత స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రావడం వల్ల నోకియా ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం HMD పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీ, నోకియా బ్రాండ్‌తో మళ్లీ ఫోన్లు విక్రయిస్తూ, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.